సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు మండిపోతుండటంతో మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. రెండ్రోజుల కిందట విద్యుత్ వినియోగం 100 మిలియన్ యూనిట్లు దాటడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. 132/33 కేవీ, 220/132కేవీ సబ్స్టేషన్లపై అధిక లోడ్ ఉంటున్నదని చెబుతున్నారు. ఇప్పటికే అనధికారికంగా లోడ్ రిలీఫ్ తీసుకుంటుండడంతో కరెంట్ కోతలు పెరిగాయి. దాదాపు 30 సంఖ్యలో ఉన్న 132కేవీ సబ్స్టేషన్లలో 20కిపైగా సబ్స్టేషన్లలో ఓవర్‌లోడ్ కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అంటే సుమారు 80 శాతం సబ్స్టేషన్లపై అధిక ఒత్తిడి ఉన్నదని అధికారులే చెప్పారు. నాలుగురోజుల వ్యవధిలోనే 300 మెగావాట్ల డిమాండ్ పెరగగా, విద్యుత్ వినియోగం ఎనిమిది మిలియన్ యూనిట్లు అంటే 80 లక్షల యూనిట్లు పెరిగింది. వంద మిలియన్ యూనిట్ల వద్దే గ్రేటర్‌లోని సబ్స్టేషన్లు ఓవర్‌లోడ్‌ను తట్టుకోలేక లోడ్ రిలీఫ్‌లకు పోతుంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిమాండ్, వినియోగం పెరిగి 110 మిలియన్ యూనిట్లకు చేరితే పరిస్థితేంటంటూ అధికారులు మాట్లాడుకుంటున్నారు.
కేసీఆర్ హయాంలో అవాంతరం లేకుండా సరఫరా
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఎలాంటి అవాంతరం లేకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ సమీక్షలతో అధిక లోడ్‌ను సైతం తట్టుకునేలా ఏర్పాట్లు చేయడమే కాకుండా పరిశ్రమలకు పవర్‌హాలిడేలు, గ్రేటర్లో నాలుగు నుంచి ఆరుగంటల పాటు లోడ్రిలీఫ్ల పేరుతో ఉండే కోతలకు ఫుల్‌స్టాఫ్ పడింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు ట్రాన్స్‌కోకు కానీ, టీజీఎస్పీడీసీఎల్కు కానీ సమన్వయం లేకపోవడం కారణంగా అసలు సమీక్ష సమావేశాలే జరగడం లేదు. అలాగే రెండేండ్లలో కొత్త సబ్స్టేషన్లకు టెండర్లే తప్ప.. పనులు మొదలే పెట్టలేదు. కేవలం టెండర్ల వరకు పిలిచి ఖరారు చేసి అక్కడే ఆపేసిన డిస్కం వ్యవహారం వెనక కమీషన్ల వ్యవహారం పెద్ద ఎత్తున ఉండడమే కారణమన్న ఆరోపణలు లేకపోలేదు.
తాజాగా, అసలు విద్యుత్ సబ్జెక్టుతో సంబంధం లేని ఓ డైరెక్టర్ డిస్కం ఉన్నతాధికారిని చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రస్తుతం లోడ్‌ను పర్యవేక్షించాల్సిన డైరెక్టర్లపై పెత్తనం చెలాయిస్తుండడం, వారు ఏదైనా చెబితే దానికి విరుద్ధంగా వేరే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చేయించడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఆ డైరెక్టర్‌కు అసలు ఆపరేషన్స్‌కు కానీ ఇతర ఏ అంశంలోనూ ప్రావీణ్యత లేదు సరికదా గతంలో తాను నిర్వహించిన విభాగంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా ఉన్నతాధికారి మాత్రం ఆయన మాటలే వింటూ.. క్షేత్రస్థాయి పరిస్థితిని పట్టించుకునే పరిస్థితి లేదంటూ మింట్‌కాంపౌండ్‌లో చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ట్రాన్స్‌కోకు చెందిన ట్రాన్స్మిషన్ డైరెక్టర్ ట్రాన్స్‌కో ద్వారా ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని, పరిస్థితి ఇలాగే ఉంటే సబ్స్టేషన్లు తట్టుకోవడం కష్టమేనంటూ చేతులెత్తేశారు.