సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9న డిస్కం పరిధిలో 11792 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా గత సంవత్సరం ఇదే సమయానికి 10,528 మెగావాట్లు నమోదయింది. ఈ సంవత్సరం 14.23 శాతం అధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సెప్టెంబర్ 9న 4782 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా, గత సంవత్సరం ఇదే రోజున 3,678 మెగావాట్లు నమోదైనట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్నినో కారణంగా వర్షాలు లేక, ఎండల వేడి, ఉక్కపోతలతో ఎండాకాలం వంటి వాతావరణ పరిస్థితులు ఉండడంతో సెప్టెంబర్లో అత్యధిక డిమాండ్ నమోదవుతున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.