కాంగ్రెస్ పాలనలో విద్యుత్ అంతరాయాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కరెంటు పోవడం.. కొద్దిసేపటి తర్వాత రావడం..సాధారణమైపోతున్నది. ఇదిలా ఉంటే శుక్రవారం గ్రేటర్లో 24 గంటల్లో ఏకంగా 40సార్లకుపైగా సరఫరాకు అంతరాయం కలిగింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నిర్వహించే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంబంధిత సర్కిల్ అధికారులు ఫొటోలతో సహా పోస్టులు సైతం పెట్టడం గమనార్హం. కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉన్నా.. సర్కా రు పర్యవేక్షణ లేకపోవడం.. దీనికితోడు నెట్‌వర్క్‌ల నిర్వహణలో కాంట్రాక్టర్లు చేస్తున్న మొక్కుబడి పనులతో నిత్యం సమస్యలు ఎదురవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
-సిటీబ్యూరో
Power Cuts | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10 సర్కిల్ కార్యాలయాలైన హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, హబ్సిగూడ, మేడ్చల్, సంగారెడ్డిల పరిధిలో విద్యుత్ వినియోగదారులు కరెంటు సరఫరాలో నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. కరెంటు పోవడం.. కొంతసేపటి తర్వాత రావడం అనేది సర్వసాధారణంగా మారిందని, తరచూ ఫోన్లు చేసి విరక్తి వస్తోందంటూ వినియోగదారులు వాపోతున్నారు. విద్యుత్ నెట్వర్క్ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని కింది స్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు.
డిపార్టుమెంట్‌కు సంబంధించిన పనులు చేసే కాంట్రాక్టర్లు సరిగా చేయకపోవడం వల్లే తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. వినియోగదారుడు ఫిర్యాదు చేసిన వెంటనే (ప్యూజ్ ఆఫ్ కాల్) సిబ్బంది అక్కడికి వెళ్లి సరిచేసి సరఫరాను పునరుద్ధరించాల్సి వస్తోంది. కాంట్రాక్టర్లు సరిగా పనులు చేయరు. నిర్వహణ, మరమ్మతు పనులు చేసినట్లు బిల్లులు మాత్రం తీసుకుంటారు. దీనివల్లే క్షేత్ర స్థాయిలో నెట్‌వర్క్‌లో ప్రతి రోజూ విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని మేము సర్కిల్ పరిధిలోని ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ స్థాయి అధికారులకు చెప్పినా.. వారు కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సరఫరా నిలిచిపోయిన వెంటనే మేము అక్కడి వెళ్లి పునరుద్ధరణ చేయకపోతే మమ్మల్నీ బాధ్యులను చేస్తున్నారు. డిపార్టుమెంట్ పనులు చేసే కాంట్రాక్టర్లపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోతే ఇలాంటి సమస్యలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.
నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలంటే నెట్‌వర్క్‌లో నిర్వహణ, మరమ్మతులు అత్యంత కీలకం. ఇప్పటికే వినియోగంలో ఉన్న నెట్వర్క్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. అయితే కాంట్రాక్టర్లు చేస్తున్న పనులపై సరిగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. డిపార్టుమెంట్‌కు సంబంధించిన పనులను కాంట్రాక్టర్లు మొక్కబడిగా చేయడం వల్లే తరచూ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉండి లైన్లను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. కింది స్థాయి అధికారులు మాత్రం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్టు చేసిన సర్కిల్ అధికారులు(కొన్ని మాత్రమే)