బల్దియా డీసీల బదిలీలలు!
సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో రెండు రోజుల కిందట జరిపిన డిప్యూటీ కమిషనర్ల (డీసీ)ల బదిలీలు అధికారుల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జాయింట్ కమిషనర్లు, డీసీలు కలిపి 14 మందికి స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఇందులో గంటల వ్యవధిలోనే మరో ఆర్డర్ రావడం, డీసీల మార్పు వెనుక రాజకీయ జోక్యం ఉందని ఉద్యోగుల్లో ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా ఆదిబట్ల, బడంగ్‌పేట డీసీల పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని పోస్టింగ్‌లు ఇప్పించారన్న చర్చ జరుగుతున్నది.
జాయింట్ కమిషనర్ (అడ్మిన్)గా ఉన్న అధికారి బడంగ్‌పేటకు తిరిగి పాత స్థానానికి పోస్టింగ్ తెచ్చుకున్న డీసీ వ్యవహారం ఒకటైతే.. తొలుత ఆర్డర్లో యూసుఫ్‌గూడ డీసీగా పోస్టింగ్ రావడం..వెనువెంటనే మళ్లీ ఆదిబట్లకు ఖరారు కావడం వెనుక ఏం జరిగి ఉంటుందోనన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సాధారణంగా బదిలీల జాబితా విడుదలయ్యాక అధికారులు తమ కొత్త స్థానాల్లో బాధ్యతలు తీసుకుంటారు. మొత్తంగా ఆదాయం ఎక్కువగా ఉంటే సర్కిళ్ల కోసం డీసీలు తమకున్న రాజకీయ పలుకుబడిని విచ్చలవిడిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ బదిలీల వెనుక భారీ ఎత్తున చేతులు మారినట్లు ప్రచారం సాగుతున్నది.