సిటీ బ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్‌సాగర్ జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా జలాశయం నుంచి వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1761.15 అడుగల నీటి మట్టం ఉందని తెలిపారు. 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, విపత్తు నిర్వహణ విభాగాలు జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు. జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పరిస్థితిని గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.