Hyderabad | సైదాబాద్, జూన్ 19 : సైదాబాద్ మండల పరిధిలోని ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీ సర్వేనెంబర్ 65 నుంచి 77 వరకు, 133 పార్ట్‌లోని 25 ఎకరాల స్థలంలో గుడిసెలు వేసుకొని పేద ప్రజలు జీవిస్తున్నారని వారందరికీ తక్షణమే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్, స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ జిల్లాలకు చెందిన పేద ప్రజలు స్థానికంగా గుడిసెలు వేసుకొని అనేక ఏండ్లుగా జీవిస్తున్నారని, వారికి ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఇచ్చారని, అదే విధంగా స్థానికంగా గుడిసెల్లో సీసీ రోడ్లు, కరెంట్ వంటి సౌకర్యాలు కల్పించారని తెలిపారు. గుడిసెవాసులందరికీ పొజిషన్ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆఖిల పక్ష పార్టీలు ప్రభుత్వాలను, అధికారులను కోరాయని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో కొందరు సొసైటి పేరుతో ఆక్రమించాలని చూస్తున్నారని, అందుకోసం రెవెన్యూ అధికారుల పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, సీఎం రేవంత్, నగర ఇన్చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, అలివేలు, లడ్డు పటేల్, మాదారం లక్ష్మన్‌రావు, శంకర్ నాయక్, దాస్ తదితరులు పాల్గొన్నారు.