సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంటరు! కానీ ఆ అబద్ధమే సిగ్గుపడేలా మాట్లాడితే ఎలా ఉంటది! సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee hills By Election) ప్రచారంలో మంత్రుల మాటల అలాగే ఉన్నాయి. నవ్విపోదరుగాక.. నాకేటి! అన్నట్టు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓట్ల కోసం లేని గొప్పలు చెప్పుకొంటూ అభాసుపాలవుతున్నారు. వేలాది మంది నిరుపేదలు లక్షల రూపాయల డబుల్ బెడ్రూం ఇండ్లు (Double Bedroom House) పొంది సంతోషంగా ఉంటే.. అసలు కేసీఆర్ (KCR) సర్కారు ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇవ్వలేదని మంత్రి పొన్నం.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఎర్రగడ్డలో టిమ్స్‌కు పునాది రాయి వేయడమే గాక భారీ భవనాన్ని కట్టించిన కేసీఆర్‌ను పట్టుకొని పునాదిరాయి వేస్తే తామే బిల్డింగ్ నిర్మించామంటూ మరో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వారి డైలాగులు విన్న జనమంతా ‘మీ నోటికి మొక్కాలె సారూ! అని నవ్వుకుంటున్నారు.
కేసీఆర్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ ఒక్క నిరుపేదకు కూడా డబుల్బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని రెండు రోజుల కిందట మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో సెలవిచ్చారు. ఆయన ఈ మాటలు మాట్లాడిన యూసుఫ్‌గూడకు కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉన్న రహమత్‌నగర్ డివిజన్లోని కమలానగర్లో 270మంది నిరుపేదలు డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ప్రశాంతంగా జీవిస్తున్నారు. గతంలో అక్కడ గుడిసెలు ఉంటే కేసీఆర్ ప్ర భుత్వం వాటిని తొలగించి అక్కడే వారు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ ఇండ్ల స ముదాయాన్ని నిర్మించి ఇచ్చారు.
ఇదే కా దు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో 500 చొప్పున అంటే 3వేల మంది నిరుపేదలకు దివంగత ఎమ్మెల్యే మా గంటి గోపీనాథ్ దగ్గరుండి కొల్లూరు డబుల్ ఇండ్ల సముదాయంలో ఇండ్లను కేటాయించి ఇచ్చారు. ఇలా అధికారికంగా 3,270 నిరుపేదలు చిల్లిగవ్వ చెల్లించకుండా రూ.50 లక్షలకు పైగా విలువైన ఇండ్లను సొంతం చేసుకొని తమ కుటుంబాలతో ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా పేదలకు కించిత్ మేలు చేయకపోగా కేసీఆర్ చేసిన మంచిని కాదంటే ఎలా అని జనం నవ్వుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు దాటింది. హైదరాబాద్ మహానగరంలో ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టి తట్టెడు మట్టి పని జరగలేదు. జనానికి నయాపైసా ప్రయోజనం చేకూరలేదు. కేసీఆర్ హయాంలో చేపట్టిన ఫ్లైఓవర్లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి పునాది రాయి వేసిన ప్రాజెక్టులకే నేటికీ అతీగతీ లేదు. అలాంటిది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ పరిధిలో ఉన్న టిమ్స్ భవనానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం పునాదిరాయి వేస్తే కోమటిరెడ్డి ప్రభుత్వం భవనాన్ని నిర్మించిందట! వినేవాళ్లు ఉంటే కాంగ్రెసోళ్లు ఏదైనా చెప్తారు అన్నట్లున్నది.
దశాబ్దాల తరబడి హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఉస్మానియా దవఖానాలపై మోయలేని భారం ఉన్నా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆస్పత్రులపై భారం తగ్గడంతో పాటు నిరుపేదలకు సైతం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో రూ.2,679 కోట్ల అంచనా వ్యయంతో ఎర్రగడ్డ(సనత్‌నగర్), గడ్డి అన్నారం, అల్వాల్‌ల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టారు. పునాది రాయి వేయడమే కాదు.. మూడు చోట్లా భవన నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరిగాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్వహిస్తున్న ఆర్అండ్బీ శాఖ పట్టించుకోకపోవడంతో పనులన్నీ పడకేశాయి.
అందుకే ఇటీవల మాజీ మంత్రి హరీశ్‌రావు గడ్డి అన్నారంలోని టిమ్స్ పనులను పరిశీలించి సర్కారు తీరును ఎండగట్టారు. ఎర్రగడ్డ టిమ్స్ పనుల్ని కొన్నిరోజుల కిందటే పునరుద్ధరించారు. సర్కారు నిర్వాకం ఇలా ఉంటే మంత్రి కోమటిరెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం కేవలం శిలాఫలకం వేస్తే తాను భవనాన్ని నిర్మించానని చెప్పడమంటే మంది బిడ్డను మా బిడ్డ అనడంగాక ఇంకేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.