సిటీబ్యూరో/అబిడ్స్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ) : మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా 8వ తేదీన నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, శాట్స్ చైర్మన్ శివసేనరెడ్డి, అధికారులతో కలిసి ఎగ్జిబిషన్ మైదానంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూ లైన్ల వద్ద ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయడం, తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వాటర్ ప్రూఫ్ జనరేటర్లను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు.
చేప ప్రసాదం పంపిణీ 8వ తేదీన రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని, కార్యక్రమం ముగిసే వరకు కంట్రోల్ రూం ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక ఆల, అదనపు సీపీ తస్వీర్ ఇక్బాల్, గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్, జీహెచ్ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్ ఉదయ్ కుమార్, గోషామహల్ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి, బేగంబజార్ ఇన్స్పెక్టర్ భరత్‌కుమార్, జీహెచ్ఎంసీ 30వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాశ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి, హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణ పాల్గొన్నారు.