Bandlaguda | బండ్లగూడ, ఏప్రిల్ 11 : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కలుషిత నీరు గత కొన్ని రోజులుగా కలకలం రేపుతుంది. గతంలో అనేక మార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కూడా అదే కలుషిత నీరు రావడంతో ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఫిబ్రవరి నెలలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు హిమాయత్ సాగర్ నుంచి నీటిని పంపిణీ చేసేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. కాగా అధికారుల నిర్లక్ష్యంతో నీటి శుద్ధి యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజలకు మంచినీటికి బదులుగా కలుషితనీరు వస్తుంది.
విషయము తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రావుల కోళ్ల నాగరాజు ఇతర నాయకులతో అక్కడికి చేరుకొని సమస్యను పరిశీలించారు. అనంతరం జలమండలి మేనేజర్ శ్రీనివాస్‌తో ఆ నీటిని శుద్ధి మీటర్‌తో పరిశీలించారు. అక్కడ నిజంగానే కలుషిత నీరు వస్తున్నాయని గ్రహించిన అధికారి ఇకమీదట కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలో హిమాయత్ సాగర్ నుంచి కలుషిత నీరు వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో మరల ప్రజలకు కలుషితనీరు పంపిణీ చేయడం బాధాకరమన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని నీటి శుద్ధి యంత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి మంచినీటిని అందించాలని వారు డిమాండ్ చేశారు.