GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): తమ పదవీ కాలం పూర్తవుతుండటంతో అందిన కాడికి దండుకోవాలని జీహెచ్ఎంసీ పాలక మండలిలోని కొందరు పెద్దలు అక్రమార్జనపై ఫోకస్ పెట్టినట్లు కార్మిక, ఉద్యోగ సంఘాలు చర్చించుకుంటున్నాయి. అందు కోసమే కొందరు పెద్దలు రాజకీయాలు చేస్తున్నారా? అంటే ఉద్యోగ కార్మిక వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. ఇటీవల జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనంగా ఉంటున్నాయని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఫిబ్రవరి 11వ తేదీతో పాలక మండలి అధికారిక గడువు ముగుస్తుండటంతో మిగిలిన కొన్ని రోజుల్లో వీలైనంత ఎక్కువ కూడబెట్టుకునేందుకు పాలక వర్గం పెద్దలు పలువురు బరితెగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరితో ఎలాంటి సంబంధం లేకుండా అడ్మిన్ సెక్షన్లో రొటీన్ ప్రాసెస్‌గా జరిగిపోయే పదోన్నతుల ప్రక్రియలోనూ కలుగజేసుకొని అడ్డంకులు సృష్టిస్తున్నట్లు కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
జీహెచ్ఎంసీ రికార్డు అసిస్టెంట్ మొదలు జూనియర్, సీనియర్, సూపరింటెండెంట్,అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పోస్టుల వరకు పదోన్నతులు పొందేందుకు వందలాది మంది ఉద్యోగులకు అర్హత ఉన్నా, పాలక మండలి ఉద్దేశపూర్వకంగా పలు సాకులు చెబుతూ ఆ ప్రక్రియను నిలిపేసిందని సమాచారం. అయితే పాలక మండలి పెద్ద చెప్పినట్లు వినే వారికి, డిమాండ్ చేసిన మొత్తాన్ని సమర్పించుకునే వాళ్లకు మాత్రం పదోన్నతులు దక్కుతాయనే ఉద్యోగులలో చర్చ జరుగుతున్నది.
ప్రధానంగా సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతులు పొందాల్సిన ఉద్యోగులు సుమారు 80 మంది వరకు ఉండగా.. ఇటీవల కేవలం 22 మందికి పదోన్నతులను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెలువడేందుకు కూడా పాలక మండలి పెద్ద ప్రమేయమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలక మండలిలో తానే పెద్దనని అన్నీ తానుగా చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇటీవల 22 మందికి ఇచ్చిన పదోన్నతుల ఉత్తర్వులకు సైతం భారీగా లంచాలు తీసుకున్నారని, ఆ తరువాతే వారికి పదోన్నతిపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో రిటైర్డుమెంట్ రోజు పదోన్నతి పొందిన ఉద్యోగి సైతం ఉన్నారు. అర్హులైన చిరుద్యోగులకు సకాలంలో పదోన్నతులను కల్పించాలని ఇప్పటి వరకు పలు యూనియన్లు చాలా సార్లు కమిషనర్‌కు వినతి పత్రాలు సమర్పించారు. అయితే గత కమిషనర్ హయాంలో ప్రమోషన్ల లిస్ట్ తయారు కాగా, పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వకుండా కాలయాపన చేసేందుకు విజిలెన్స్ ఎంక్వైరీ అంటూ కొర్రీలు పెట్టినట్లు సమాచారం.
ఆ తరువాత పదోన్నతలుకు అర్హత కల్గిన 22 మంది పాలక మండలి పెద్ద ఆఫీసులోని ఓ పెద్ద మనిషిని కలిసిన తరువాతే ఆ పదోన్నతుల ఆదేశాలు వెలువడ్డాయని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. రికార్డు అసిస్టెంట్ మొదలు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పోస్టుల వరకు పదోన్నతులకు సిద్ధంగా ఉన్న ఉద్యోగులు వందల్లో ఉంటారని సమాచారం.
రేపు స్టాండింగ్ కమిటీ సమావేశం..?
ఈ నెల 14న జరుగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో నాలుగు క్యాడర్లకు సంబంధించిన పదోన్నతులపై చర్చ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. కొద్ది సంవత్సరాల క్రితమే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పోస్టులో పదోన్నతులకు అర్హత ఉన్నా ఉద్యోగులకు ఆ పదోన్నతులు ఇవ్వకుండా నిలిపివేసేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
సెప్టెంబర్ మాసం కల్లా పదోన్నతులకు అర్హత సాధించే పదుల సంఖ్యలో ఉన్న కొందరు ఉద్యోగుల కోసం ఇప్పటికే అర్హత ఉన్న వారికి ఇవ్వకుండా పదోన్నతులకు బ్రేక్ వేసేందుకు పాలక మండలి పెద్దలు కొందరు పెద్ద వ్యూహాలు రచించినట్లు సమాచారం. ఇందుకు 14వ తేదీన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.