Hyderabad Police | సిటీబ్యూరో: ఏ తప్పు చేసినా.. రక్షించేందుకు రాజకీయ నాయకులైన గాడ్ ఫాదర్స్ ఉన్నంత వరకు తమను ఎవరు ఏమీ చేయాలేరనే ధీమాతో నగరంలో కొందరు పోలీస్ అధికారులు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న కొందరు సీఐలు, ఏసీపీలపై వచ్చిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చూసినా.. వారిని నీడలా కాపాడే రాజకీయ నాయకులైన గాడ్ ఫాదర్స్ ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తమ వారిపై ఈగ వాలనీయకుండా ఉండేలా చూసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ కమిషనర్‌గా గతంలో పనిచేసిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సమయంలో ఆరోపణలొస్తే వెంట వెంటనే ఆయన అంతర్గత విచారణ చేసి..ఏకంగా పంజాగుట్ట ఠాణాలోని సిబ్బందినే పూర్తిగా మార్చేశారు. ఆయన బదిలీపై వెళ్లిన తరువాత రెండోసారి సిటీ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ అన్ని విషయాలపై అచితూచి అడుగులెస్తున్నారు. ఆయన మొదటి సారి హైదరాబాద్ సీపీగా పనిచేసిన సమయంలో ఉన్న దూకుడు ఇప్పడు చూపించడం లేదనే చర్చ కూడా నగర పోలీసుల విభాగంలో కొనసాగుతున్నది.
ఈస్ట్‌జోన్‌లో ఓ స్టేషన్లో నెల రోజుల కిందట అన్నదమ్ముళ్లను స్టేషన్‌కు బలవంతంగా తీసుకొచ్చి చితకబాదారు. ఎందుకు వాళ్లను స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టారని ఉన్నతాధికారులు ఆరా తీస్తే, ఒక కాంగ్రెస్ నాయకుడు వాళ్ల వద్ద మామూళ్ల కోసం ప్రయత్నం చేశాడని, వాళ్లు ఇందుకు ఒప్పుకోకపోవడంతో స్థానిక ఇన్స్పెక్టర్తో వాళ్లకు భయం తెప్పించాలనుకున్నాడు. అప్పటికే ఆ ఇన్స్పెక్టర్ స్థానిక ఏసీపీకి కూడా వాళ్లపై ఒక కన్నుంది.
దీంతో తమ గాడ్ ఫాదర్ అయిన స్థానికంగా ఉండే రాజకీయ నాయకుడు ఆదేశించాడని, బలవంతంగా అన్నదమ్ముళ్లను స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదారు. స్థానిక ఇన్స్పెక్టర్, ఏసీపీపై బాధితులు సీపీకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే సీపీకి బాధితులు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు మరో అధికారితో కలిసి బాధితుల ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. అక్కడకు వెళ్లి సారీ చెప్పినట్లు సమాచారం. తమ గాడ్ ఫాదర్స్‌తో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ఉన్నతాధికారులకు చెప్పించి.. ఒప్పించారనే విమర్శలు వస్తున్నాయి.
సెంట్రల్ జోన్లో ఓ ప్రార్థనమందిరం విషయంలో రెండు వర్గాల మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తున్నది. ఒక వర్గంలో ఆధీనంలో ఉన్న పొజిషన్‌ను మరొకరికి ఇప్పించేందుకు స్థానిక ఏసీపీ రూ. 50 లక్షలకు డీల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏసీపీతో డీల్ కుదుర్చడంలో ఒక రాజకీయ నాయకుడు కీలక పాత్ర పోషించాడనే విమర్శలున్నాయి. అలాగే సదరు రాజకీయ నాయకుడు ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడి ఆ ఏసీపీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా తన వంతు పాత్ర పోషించాడు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా రంగంలోకి దిగి, ప్రార్థన మందిరం వ్యవహరానికి సంబంధించి ఏసీపీ గురించి కాని ఎవరూ బయట మాట్లాడవద్దని హుకూం జారీ చేసినట్లు తెలిసింది.
ఈస్ట్జోన్లోనే మరో ఏసీపీ తన స్టేషన్ పరిధిలో సివిల్ సెట్ల్మెంట్లు చేయడంలో కింగ్‌గా మారాడనే విమర్శలు వస్తున్నాయి. ఈయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఆ ఏసీపీ వేధింపులకు తట్టుకోలేక హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఆయనపై పలు ఆరోపణలున్నా, ఆయనపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనామేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలున్నాయి.