సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సిఐల బదిలీలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. కొందరు ఆమాత్యులు చెప్పిన వారికి సరైన పోస్టింగ్‌లు దక్కకపోవడంతో సదరు ఇన్స్పెక్టర్లు తమ రాజకీయ పెద్దల వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఆమాత్యులు మా మాటకే విలువ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బోగట. దీంతో చేసేది లేక శనివారం రాత్రి ఇచ్చిన 65 మంది ఇన్స్పెక్టర్ల బదిలీల ఉత్తర్వులను ఆదివారం ఉదయానికి నిలిపివేస్తూ, కొత్త పోస్టింగ్‌లలో ఎవరూ చేరవద్దుంటూ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందడం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పోలీసు శాఖలో డీఎస్పీ, ఆ పై స్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లలో పై స్థాయి రాజకీయ పెద్దల జోక్యం ఉంటుందనేది బహిరంగ రహస్యం. కాని సైబరాబాద్‌లో మాత్రం సీఐ స్థాయి అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లను సైతం ఉన్నత స్థాయి రాజకీయ ఆమాత్యులు ప్రభావితం చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరి కోసం మొత్తం బదిలీల జాబితానే నిలిపివేశారంటే దాని వెనక ఎంత పెద్ద రాజకీయ శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.
చక్రం తప్పిన డీసీపీలు?
ప్రస్తుతం జరిగిన సీఐల బదిలీలలో రాజకీయ శక్తులకు ఏ మాత్రం తీసుపోకుండా కొందరు డీసీపీ స్థాయి అధికారులు సైతం చక్రం తప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ అండదండలతో కొందరు, పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల సహకారంతో మరికొందరు పైరవీలు చేయించుకొని కోరుకున్న పోస్టింగ్‌లను పొందారానే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు జోనల్ స్థాయి అధికారులు తమకు చేదోడు, వాదోడుగా ఉండే సీఐలను తమ సొంత పూచికత్తుతో తమ వద్దకు రప్పించేలా కూడా చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఒక సీఐ ఓ మహిళ అధికారిని వేధింపులకు గురి చేయడంతో పాటు పలు ఇతర ఆరోపణలు ఎదురొని, బదిలీ వేటుకు గురై, పోస్టింగ్‌కు దూరంగా ఉండగా, సదరు సీఐని ఓ జోనల్ స్థాయి అధికారి చేరదీసి, తన జోన్ పరిధిలోని అత్యంత ప్రాధాన్యతగల ఠాణాను ముట్టచెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతిభ చూడకుండానే..
ప్రతిభ ఆధారంగా పోస్టింగ్స్ ఇవ్వడం పరిపాటి. కానీ ప్రస్తుతం రూపొందించిన బదిలీల జాబితాలో అందుకు పూర్తి విరుద్ధంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇతర యూనిట్లకు చెందిన 9మందితో పాటు అటాచ్‌లో ఉన్న మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లకు అత్యంత ప్రాధాన్యత గల ఫోకల్ పోస్టింగ్‌లు కల్పించి అందెలం ఎక్కించడంపై సొంత శాఖలోనే సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం జరిగిన బదిలీలలో ఓ అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన వారికే అధిక ప్రాధాన్యత కల్పించారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. కోరుకున్న పోస్టింగ్‌లు దక్కడంతో ఎంతో ఉత్సాహంగా పార్టీలకు సిద్ధమైన పలువురు అధికారులు పోస్టింగుల్లో చేరవద్దని వచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. ముఖ్యంగా పెట్టుబడులు, పైరవీలతో పోస్టింగ్‌లు దక్కించుకున్న అధికారుల్లో తీవ్ర అయోమయం నెలకొంది.