జాతీయ రహదారిపై తొమ్మిది కిలో మీటర్ల రెయిలింగ్
20కు పైగా బ్లాక్ స్పాట్స్…
ట్రాఫిక్, ఇంజినీరింగ్ అధికారుల సంయుక్త పరిశీలన
ప్రమాదాల నివారణకు కృషి : సీఐ సుమన్
మియాపూర్, మార్చి 26 : జాతీయ రహదారి-65పై రోడ్డు దాటేందుకు పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న బ్లాక్ స్పాట్లను ట్రాఫిక్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు శనివారం పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలోని ఇక్రిషాట్ నుంచి ఆల్విన్ ఎక్స్‌రోడ్ వరకు సుమారు 20 ప్రాంతాలకు పైగా ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకుంటూ పాదచారులు మరణిస్తుండటం, తీవ్ర గాయాలపాలవుతుండటం జరుగుతున్నట్లు గుర్తించారు. గతేడాది ఈ జాతీయ రహదారిపై ఈ ప్రాంతంలో రోడ్డు దాటుతూ సుమారు 23 మంది వరకు మరణించినట్లు ట్రాఫిక్ పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. వీటిని నివారించేందుకు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటకుండా చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇక్రిషాట్ నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు సుమారు 9 కిలో మీటర్ల మేర రహదారి మధ్యలో రెయిలింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు వీలుగా 14 ప్రాంతాల్లో రెయిలింగ్‌ను కొద్ది మేర అధికారికంగా తెరిచి ఉంచుతారు. కేవలం నిర్ధారిత ప్రాంతం నుంచి మాత్రమే వారు రోడ్డు దాటేలా ఈ చర్యలు చేపట్టనున్నారు. ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగాల బడ్జెట్‌తో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 9 కిలో మీటర్ల మేర రెయిలింగ్ ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు. పాదచారుల భద్రత కోసం జాతీయ రహదారిపై అవసరమైన ప్రాంతాల్లో పాదచారుల సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరో పక్క ఆల్విన్ చౌరస్తా, మదీనాగూడ, మై హోం జువెల్ వద్ద ఫుట్ ఓవర్ వంతెనలను సైతం పాదచారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. జాతీయ రహదారిని దాటే పాదచారులు ప్రమాదాలకు గురికాకుండా పటిష్టమైన రక్షణ చర్యలను చేపట్టనున్నట్లు మియాపూర్ సీఐ సుమన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీసీ హన్మంతరావు, చందానగర్ ఈఈ శ్రీకాంతిని పాల్గొన్నారు.