Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యూసుఫ్‌గూడలోని ఈ స్టేడియం వద్ద మొత్తం 500 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలు చోట్ల పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా రహమత్ నగర్, బోరబండ ఏరియాలపై నిఘా ఉంచారు పోలీసులు. రోజంతా ఈ ప్రాంతాల్లో స్పెషల్ పోలీసులు గస్తీ నిర్వహించనున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.