సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): క్రీడలు, ఆటలతో శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను గోషామహల్ పోలీస్ స్టేడియంలో సోమవారం నగర పోలీస్ కమిషనరేట్ సీవీ ఆనంద్ సమక్షంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, సి.కశ్యప్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనరేట్‌లో 24 రకాల క్రీడలల్లో 14 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. సిటీ పోలీసింగ్‌లోని అన్ని విభాగాల నుంచి ఈ జట్లలో సభ్యులు పాల్గొంటున్నారని అన్నారు. ఈ సారి టీమ్స్ ఎక్కువగా ఉండడంతో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు.
నేనూ స్పోర్ట్స్మ్యాన్నే
తాను కూడా ఒక స్పోర్ట్స్మ్యాన్నే అని సీవీ ఆనంద్ చెప్పారు. క్రికెట్లో బ్యాటింగ్ చేసేటప్పుడు సెంచరీ చేయాలనే పట్టుదలతో పిచ్‌పైకి దిగుతానని, పరుగు పందెంలో పాల్గొంటే… వంద మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉంటానని పేర్కొన్నారు. ఆటల్లో ఓడిపోతే తనకు ఆ రాత్రి నిద్ర పట్టదని చెప్పారు. కాగా, ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్, కశ్యప్‌లు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం అనేది సంక్లిష్టతలతో కూడిన ఉద్యోగమని, అలాంటి వారికి ఇటువంటి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగద అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, విశ్వప్రసాద్, కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రాచకొండలో స్పోర్ట్స్ మీట్
రాచకొండ కమిషనరేట్‌లో స్పోర్ట్స్ మీట్ సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ క్రీడలు జీవితంలో ముఖ్య భాగమని, వివిధ రకాల మానసిక శారీరక ఒత్తిళ్లను అధిగమించడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. రాచకొండ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని, గరిష్ట శిక్షారేట్ను సాధిస్తూ గొప్పగా పనిచేస్తున్నారని కొనియాడారు. వారికి విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడులను, వివిధ రకాల సవాళ్ల నుంచి ఉపశమనం పొందేలా, నూతనత్తేజంతో తమ విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడానికి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఆయన నాగోల్ క్రికెట్ స్టేడియంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్‌మీడియాకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మహేశ్వరం, క్రైమ్స్, ఎస్ఓటీ, సైబర్‌క్రైమ్, ఉమెన్ సేఫ్టి డీసీపీలు రాజేశ్ చంద్ర, ప్రవీణ్‌కుమార్, పద్మజ, సునీతారెడ్డి, అరవింద్‌బాబు, మురళీధర్, రమణారెడ్డి, నాగలక్ష్మి, ఉషా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.