Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 13: కుమా ర్తె పెళ్లి సందర్భంగా పనుల్లో సాయం చేస్తాడనే ఉద్దేశంతో పిలిపించిన యజమాని ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన కరుడుగట్టిన నేరస్తుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండ్రోజుల కిందట ప్రముఖ ఆయిల్ వ్యాపారి రోహిత్ కేడియా నివాసంలో కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు, నగదు చోరీ కేసును పోలీసులు 24 గంట్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
హిమాయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కేడియా గ్రూప్ సంస్థ అధినేత రోహిత్ కేడియా కుమార్తె పెళ్లి కోసం 5 రోజుల కిందట కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సహా దుబాయి వెళ్లారు. కాగా, ఈనెల 11న ఉదయం రోహిత్ కేడియా సంస్థలో పనిచేస్తున్న అభయ్ కేడియా అనే వ్యక్తి యజమాని ఇంటికి వెళ్లగా, తాళాలు పగులగొట్టి కన్పించాయి. దీంతో లోనికి వెళ్లి చూడగా.. అల్మారాలో ఉండాల్సిన పెద్ద మొత్తంలో ఆభరణాలు,వజ్రాలు, నగదు, విదేశీ కరెన్సీ కనిపించలేదు. దీంతో ఈ విషయంపై నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సుమారు రూ.2కోట్లకు పైగా విలువజేసే సొత్తు మాయమైందని, యజమాని కుటుంబసభ్యులు వచ్చి చూస్తే పోయిన సొత్తు ఎంత అనేది తేలుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులతో పాటు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలతో పాటు ఇతర ఆధారాలను సేకరించిన పోలీసులు చోరీకి పాల్పడినవారిని బీహార్ రాష్ట్రం మధుబన్ జిల్లా బిరౌల్ గ్రామానికి చెందిన మోల్హూ ముఖియా అలియాస్ మనోజ్ ముఖియా(35) అనే పాత నేరస్తుడితో పాటు అదే ఇంట్లో పనిచేస్తున్న కుక్ సుశీల్ ముఖియా(29), కోల్‌కతాకు చెందిన పని మనిషి బసంతి అర్హి (40) అని తేలింది.
రైళ్లో నిందితుల అరెస్టు
ఈనెల 11న వ్యాపారి కేడియా ఇంట్లో చోరీ విషయంపై సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఘటనా స్థలం చుట్టూ సీసీ ఫుటేజీని పరిశీలించగా.. ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు చోరీ సొత్తుతో వెళ్తున్నట్లు తేలింది. సీసీ ఫుటేజీని వ్యాపారి కేడియా కుటుంబసభ్యులకు పంపించగా.. వారిలో మనోజ్ ముఖియా రెండేళ్లకిందట తమ ఇంట్లో పనిచేశాడని, పదిహేను రోజుల కిందట పెళ్లి పనుల కోసం తిరిగి పిలిపించామని చెప్పారు. మిగిలిన ఇద్దరు కూడా తమ ఇంట్లోనే పనిచేస్తున్నారని నిర్ధారించారు. దీంతో వారిని పట్టుకునేందుకు భోపాల్, నాగపూర్, పాట్నాలకు పోలీసులు విమానంలో వెళ్లి నిఘా పెట్టారు.
దీంతో పాటు అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం ఇచ్చి నిందితులు సొంతూరికి వెళ్లడం కానీ, ఇతర నగరానికి వెళ్లి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి పోలీసులకు దొరక్కుండా సొత్తును మాయం చేయడం కానీ చేస్తారన్న అంచనాతో పోలీసులు పలు రైళ్లలో తనిఖీలు చేపట్టారు. వివిధ రైల్వే స్టేషన్లలో సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టగా.. నిందితులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వైపుకు వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో నాగపూర్‌కు వెళ్లిన పోలీసు బృందం అక్కడి రైల్వే అధికారుల సాయంతో రైలు కోసం కాపు కాశారు. నాగపూర్‌కు రైలు చేరుకోగానే అన్ని బోగీల్లో తనిఖీ చేయగా.. నిందితులు ముగ్గురూ పట్టుబడ్డారు. వారిని వీడియో కాల్ ద్వారా దుబాయిలో ఉన్న రోహిత్ కేడియా కుటుంబసభ్యులకు చూపించగా.. వారే తమ ఇంట్లో చోరీ చేసిన వారు అని నిర్ధారించారు. వారి వద్ద నుంచి 710 క్యారెట్ల వజ్రాభరణాలు, 1.4కేజీల బంగారు ఆభరణాలు, రూ.19.6లక్షల నగదు, 215 గ్రాముల వెండి వస్తువులతో పాటు 24దేశాలకు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు ప్రస్తుతం రూ.5కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
హత్యకేసులో నిందితుడిగా మనోజ్ ముఖియా..
రోహిత్ కేడియా నివాసంలో చోరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనో జ్ ముఖియాతో పాటు మిగిలిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా.. షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఏడాది కిందట దోమలగూడలో స్వర్ణలత (63) అనే వృద్ధురాలిని హత్య చేసి సుమారు కోటి రూపాయల సొత్తుతో ఉడాయించిన ఘటనలో మనోజ్ ముఖియా నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బీహార్‌కు చెందిన రాహుల్, మహేశ్ అనే వ్యక్తులతో కలిసి స్వర్ణలతను దారుణంగా చంపి పరారయినట్లు తేలింది. ఆ కేసులో మిగిలిన నిందితులు ఇంకా పరారీలోనే ఉండగా.. సొత్తు సైతం రికవరీ కాలేదు. సంపన్నులు, వ్యాపారుల ఇండ్లలో పని మనుషులుగా చేరి అవకాశం దొరికిన వెంటనే చోరీ చేయడంతో పాటు అవసరమైతే హత్య చేసేందుకు కూడా వీరు వెనుకాడరని పోలీసుల విచారణలో తేలింది.
కాగా, రాకేష్ కేడియా ఇంట్లో గతంలో పనిచేసిన మనోజ్ ముఖియా ఏడాది క్రితం దోమలగూడ హత్య కేసు తర్వాత కనిపించకుండా పోయాడు. కేడియా ఇంట్లో పెళ్లి పనుల కోసం నమ్మకమైన వ్యక్తులను పిలిపించాలని చెప్పగా.. సుశీల్ ముఖియా 15రోజుల కిందటే మనోజ్ ముఖియాను పిలిపించాడని తేలింది. అదే ఇంట్లో పనిచేస్తున్న బసంతి అర్హీ అనే మహిళతో సుశీల్ ముఖియాకు అక్రమ సంబంధం ఉండటంతో ఆమె కూడా చోరీకి సహకరించిందని, ముగ్గురూ కలిసి సొత్తును పంచుకుని రెండు మూడేళ్లపాటు వేరే ప్రాంతంలో నివాసం ఉండాలని ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు, అదనపు డీసీపీ జే.నర్సయ్య, సుల్తాన్ బజార్ ఏసీపీ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.