వెంగళరావునగర్, నవంబర్ 13: చిరు వ్యాపారి పై పోలీసుల దాష్టీకం ప్రదర్శించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత షాప్ మూసివేయలేదన్న అక్కసుతో లాఠీలతో కుళ్లబొడిచి ఒళ్లు హూనమయ్యేలా చావబాదారు. పోలీసులు పైశాచికంగా లాఠీలతో కొట్టడంతో తీవ్రగాయాలతో బాధితుడు దవాఖాన పాలయ్యాడు. ఖాకీల కాఠిన్య దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బోరబండ పోలీసుల అరాచక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అసలేం జరిగింది..
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్ కూడలి వద్ద సూఫీ పాన్ షాప్‌ను నిర్వహిస్తుంటాడు. అతడి తమ్ముడు మెహరాజ్(21) ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుకుంటూ..అన్న సూఫీ పాన్ షాప్‌లో పార్ట్ టైమ్‌గా పని చేస్తుంటాడు. రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు రోజుకు రూ.500 లకు షాప్‌లో పనిచేసేవాడు. మంగళవారం అర్ధరాత్రి వేళ పాన్ షాప్ మూసివేయించేందుకు గస్తీ పోలీసులు లాఠీలతో లోపలికి జొరబడ్డారు. ఒక్కసారిగా షాప్ ముందున్న విద్యార్థి మెహరాజ్ పై లాఠీలతో విరుచుకుపడ్డారు. కాళ్లు, చేతులపై లాఠీలతో చావబాదారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన మెహరాజ్ చికిత్స కోసం అమీర్‌పేట ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా, పోలీసులు కొట్టడంతో గాయాలపాలయ్యానంటూ.. ఎంఎల్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వైద్యులు నిరాకరించారని బాధితుడు మెహరాజ్ వాపోయాడు.
బోరబండ పోలీసులు లాఠీలతో చావబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియోలో వైరలయ్యాయి. దీంతో కలవరపాటుకు గురైన ఖాకీలు వెంటనే బాధితుడు మెహరాజ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఆ వీడియోను డిలీట్ చేయాలని ఒత్తిడి చేశారని బాధితుడు వాపోయాడు. అంతే కాకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని షాప్‌నకు వచ్చే కష్టమర్ అనుకొని కొట్టారని చెప్పి.. పోలీసులకు అనుకూలంగా ఓ వీడియో తీయాలని చెప్పడంతో బాధితుడు ఒక సెల్ఫీ వీడియో తీసి పంపాడు. తన పై ఒత్తిడి చేసి పోలీసులకు అనుకూలంగా వీడియో తీయించారని బాధితుడు వాపోయాడు.
పొట్టకూటి కోసం పనిచేస్తే..
తానేమీ సంఘ విద్రోహి కాదని..పొట్టకూటి కోసం పనులు చేసుకుని బతుకుతుంటే ఇలా లాఠీలతో చావబాదారని.. ఇలా ఇదే మొదటిసారి కాదని.. గతంలో నాలుగుసార్లు తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారని బాధితుడు మెహరాజ్ కన్నీటిపర్యంతమయ్యాడు. నిర్ణీత సమయం దాటాక దుకాణం తెరిచి ఉన్నైట్లెతే కేసు పెట్టొచ్చని.. కానీ ఇలా వాతలు తేలేలా చావబాదడం అన్యాయమని వాపోయాడు.