Mansurabad | మన్సురాబాద్, మార్చి 17: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్క సెంటర్ పై ఎల్బీనగర్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు హుక్కా సేవిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజీవ్ గాంధీ నగర్లో ది వైట్ కప్ కేఫ్ పేరుతో హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తూ.. అమాయక యువతను వ్యసనాలకు గురి చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది.
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి హుక్కా సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. హుక్కా సేవిస్తున్న 34 మంది తోపాటు.. 4 నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు హుక్కా పాట్స్, హుక్కా ఫ్లేవర్స్, సెల్ ఫోన్లు, లౌడ్ స్పీకర్లు, ప్రొజెక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హుక్కా సెంటర్ నిర్వాహకులతో పాటు.. హుక్కా సేవించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.