సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో డీజీపీ అంజనీకుమార్‌తో కలిసి నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సమాజం కోసం, దేశం కోసం రేపటి తరాల భవిష్యత్ కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో ఎవరికి, ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పోలీసులే అన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమన్‌గల్ ఎస్ఐ కె.హనుమంత్‌రెడ్డి, తలకొండపల్లి పోలీస్ కానిస్టేబుల్ ఫహీముద్దీన్, ఆర్మ్డ్ కానిస్టేబుల్ ఈశ్వర్‌రావుల సేవలను స్మరించుకుంటూ వారి కుటుంబసభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ అవినాష్‌మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్‌నాయక్, అడ్మిన్ డీసీపీ రవిచందన్‌రెడ్డి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాచకొండ పరిధిలో..
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ అంబర్‌పేటలోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల స్మారక స్తూపానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీపీ చౌహాన్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, జవాన్ల స్మారకార్థం దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అమరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేశ్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ-1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ దరావత్ జానకి, ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, సైబర్‌క్రైమ్ డీసీపీ అనురాధ, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ-2 శ్రీనివాసులు, క్రైమ్ డీసీపీ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.