బంజారాహిల్స్, అక్టోబర్ 25 : దసరా పండుగ సందర్భంగా స్నేహితులు, బంధువులు ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశ్యంతో 15 బీర్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తూ పోలీసులకు పట్టుబడడంతో కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్ బావార్చి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రహ్మత్‌నగర్‌కు చెందిన రామ్మోహన్రావు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై కాటన్ బీర్లు తీసుకు వెళ్తుండడంతో పోలీసులు అపారు.
బాక్సులో చూడగా 15 బీర్‌బాటిళ్లు కనిపించాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అనుమతి లేకుండా ఎక్కువ సంఖ్యలో బీర్ బాటిళ్లు తీసుకువెళ్తున్నారని, కేసు నమోదు చేసి బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో నరహరి అనే వ్యక్తి సైతం 15బీర్లు కొనుగోలు చేసి ఇంటికి తరలిస్తూ పట్టుబడటంతో కేసు నమోదు చేశారు. దసరా పండుగ కావడంతో సాయంత్రం ఎక్కువమంది బంధువులు, స్నేహితులు వస్తారని, వారికోసం బీర్లు ముందుగానే కొనుగోలు చేశామంటూ నరహరి చెప్పినా ఎన్నికల కోడ్ కారణంగా కేసు నమోదు చేయాల్సిందేనని పోలీసులు చెప్పి ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.