హైదరాబాద్: నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యల (Double Murder) కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి, యువకుడిని గుర్తించారు. యువకుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్‌గా, యువతిని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందుగా గుర్తించారు.
సాకేత్ హౌస్ కీపింగ్ చేస్తూ నానక్‌రామమ్‌గూడలో ఉంటున్నాడు. బింధు ఎల్బీనగర్లో నివాసం ఉంటున్నది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతులిద్దరికి గతంలోనే పరిచయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, ఈనెల 8న బిందును ఎల్బీనగర్ నుంచి తీసుకొచ్చిన అంకిత్.. నానక్‌రామ్‌గూడలోని తన స్నేహితుడి వద్ద ఉంచాడు. దీంతో ఆమె కనిపించకుండా పోయినట్లు వనస్థలిపురంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మరోవైపు అంకిత్ అదృశ్యమైనట్లు గచ్చిబౌలిలో కేసు నమోదయింది. కాగా, ఈ నెల 11న ఇద్దరిని హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. బిందు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు.