మన్సురాబాద్, మార్చి 26: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 23న జరిగిన హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు నిర్ధారించారు. సీఐ వినోద్ కుమార్ కథనం ప్రకారం.. ఎల్బీనగర్ భరత్ నగర్ కు చెందిన బొడ్డు మహేష్ (31)తో పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాము, రాజ రాకేష్, ఓంకార్ తో సాన్నిహిత్యం ఉన్నది. బొడ్డు మహేష్, పగిళ్ల పురుషోత్తం స్నేహితులైనప్పటికి కొన్నేళ్లుగా ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది.
2023 మార్చిలో ఓ బార్ లో మద్యం సేవిస్తున్న సమయంలో ఓ విషయంపై బొడ్డు మహేష్, పురుషోత్తం మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో పురుషోత్తం బీరు బాటిల్ తో మహేశ్ చెవిపై కొట్టడంతో గాయాలయ్యాయి. ఈ విషయంపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పురుషోత్తంతో పాటు రాము పై కేసు నమోదైంది.నాటి నుంచి బొడ్డు మహేశ్, పురుషోత్తం మధ్య కక్షలు పెరిగాయి. ఈ క్రమంలో 2024 డిసెంబర్ లో పురుషోత్తం, రాము, నాగరాజుతో పాటు మరికొందరి పై బొడ్డు మహేష్ అతడి స్నేహితులు కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో పురుషోత్తం తప్పించుకోగా.. అతని మిత్రులైన రాము, నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి.
దాడికి పాల్పడిన బొడ్డు మహేష్ అతడు స్నేహితులను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కొన్ని రోజుల క్రితం బొడ్డు మహేష్అతడి స్నేహితులు జైలు నుంచి విడుదలయ్యారు. మహేష్ బ్రతికి ఉంటే తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన పురుషోత్తం అతని మిత్రులు.. ఎలాగైనా మహేష్ ను అంతమొందించాలని పథకం వేసుకున్నారు. ఈనెల 23న శనివారం అర్ధరాత్రి 12:40 గంటల సమయంలో బొడ్డు మహేష్ తన స్నేహితుడితో కలిసి యాక్టివా హోండా పై ఆర్టీసీ కాలనీ నుంచి శివగంగా కాలనీ వైపుకు వెళుతున్నాడు.
అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసి ఉన్న పురుషోత్తం గ్యాంగ్ మహేష్ శివగంగా కాలనీ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి కారుతో బైకును ఢీకొట్టారు. బైకు పైనుంచి మహేష్ కింద పడిపోగానే కారులో ఉన్న పురుషోత్తం, నాగార్జున, రాము, సందీప్ ఒక్క ఉదుటున కిందికి దిగారు. మహేష్ పై గొడ్డలి, కత్తులు, కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహేష్ ను ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించగా అప్పటికి మృతి చెందాడు. హత్యకు పాల్పడిన నిందితులైన పగిళ్ల పురుషోత్తం, నోముల నాగార్జున, మంద సందీప్, గడమోని రాము, రాజా రాకేష్, ఓంకార్ ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.