సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఫిక్చర్ కంపెనీలో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లతో పాటు మరో ఇద్దరు వినియోగదారులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి 50 గ్రాముల ఎండీఎంఏ, 10 ఎక్సటసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, ఎల్బీనగర్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన మను ప్రశాంత్ పోనుగంటి, వరికుప్పల రిత్విక్ రాజ్ ముంబైలోని ఎఫ్ఎక్స్ మూవింగ్ ఫిక్చర్ కంపెనీలో పనిచేస్తున్నారు.
ముంబైలో డ్రగ్స్ విక్రేతలతో పరిచయాలు పెంచుకొని రూ.4 వేల నుంచి రూ. 6 వేల వరకు గ్రాము ఎండీఎంఏ కొని, దానిని హైదరాబాద్‌లో రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు విక్రయిస్తున్నారు. ఇందులో రిత్విక్‌ను గతంలో నేరెడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు గతంలో నారాయణపూర్ ఠాణా పరిధిలో రేవ్‌పార్టీ ఏర్పాటు చేసి అరస్టైయిన షేక్ ఉమర్ ఫారూఖ్, ఏఎస్‌రావునగర్ చెందిన ఆనంద్ మాతేలకు సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం అరెస్ట్ చేసింది.