సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజామొయిజుద్దీన్ హత్యకేసులో పోలీసులు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వక్ఫ్‌బోర్డు భూములకు సంబంధించిన పలు కేసుల్లో ఆక్రమణలను వ్యతిరేకిస్తూ మొయిజుద్దీన్ కోర్టులో కేసులు వాదిస్తుండగా అత్యంత ఖరీదైన ఒక భూమి వ్యవహారంలో అతడిని హతమార్చినట్లు తెలుస్తున్నది. కాగా మలక్‌పేట, లక్డీకాపూల్ ప్రాంతాల్లో ఉన్న భూములకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
ఇందులో కొన్ని కేసులు వాపస్ తీసుకోవాలని న్యాయవాది మొయిజుద్దీన్‌కు బెదిరింపులు వచ్చాయి. తాను వెనక్కు తగ్గేదిలేదంటూ చెప్పడంతోనే ఈనెల 23న శాంతినగర్‌లోని ఆయన ఇంటి వద్దే న్యాయవాదిని పక్కా ప్లాన్‌తో హత్య చేశారు. ఈ కేసులో బర్కత్పురాకు చెందిన కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్న తండ్రీకొడుకులకు ప్రధాన పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారు మరో ఇద్దరి పేర్లు చెప్పడంతో ఈ కేసులో మొత్తం ఏడుగురి పాత్ర ఉన్నట్లుగా పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో తామేమీ మాట్లాడలేమని విచారణాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంతో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసుకు సంబంధించి నిందితులు, హత్యకు గల కారణాలపైన సర్వత్రా చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ నేత హస్తం..!
నగరంలోని ఓ ప్రాంతంలో ఉన్న వక్ఫ్ భూమికి సంబంధించి బర్కత్పురాకు చెందిన కీలక కాంగ్రెస్ నేతతో అడ్వకేట్ మొయిజుద్దీన్‌కు విభేదాలొచ్చాయి. ఈ భూమి విషయంలో ఎన్నిసార్లు చెప్పినా అనవసరంగా తమను ఇబ్బంది పెడుతున్నాడని, ఇలా అయితే బాగుండదంటూ ఆ నేత మొయిజుద్దీన్‌ను బెదిరించినట్లుగా బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో కేసు దర్యాప్తులో ఇబ్బందులు తలెత్తుతాయంటూ మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్, పలువురు అడ్వకేట్లు సీపీ సజ్జనార్‌ను కలిశారు.
వక్ఫ్ భూముల విషయంలో తరచూ జోక్యం చేసుకుంటూ వాటి ఆక్రమణలపై కేసులు వేస్తూ వాదిస్తున్న మొయిజుద్దీన్‌కు భారీ ఆఫర్ కూడా ఆ కాంగ్రెస్ నేత ఇచ్చినట్లు సమాచారం. రూ. 2 కోట్లతోపాటు విదేశాలకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తానని చెప్పినప్పటికీ మొయిజుద్దీన్ వినకపోవడంతో అతడిని హత్య చేయడానికి ఆ కాంగ్రెస్ నేత, అతడి కొడుకు పక్కాగా ప్లాన్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సంపాదించినట్లు తెలిసింది. మొయిజుద్దీన్‌ను అడ్డు తొలగించుకునేందుకు ఆ పనిని తావూస్, మునీర్‌లకు అప్పగించగా వారు నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును కలిసి హత్య విషయం చెప్పి సుపారీ కింద రూ. 15 లక్షలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో చెప్పినట్లు తెలిసింది.
అడ్వకేట్‌ను హత్య చేసి దానిని సాధారణ యాక్సిడెంట్‌గా చిత్రీకరించేలా ప్రణాళిక వేసి అందుకోసం సెకండ్‌హ్యాండ్ కారు కొని కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్‌కు అప్పగించి వారికి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారుతో మొయిజుద్దీన్‌ను ఆయన ఇంటి వద్దనే ఢీకొట్టి హతమార్చారు. ప్రస్తుతం కీలక నిందితులు పోలీసుల అదుపులో ఉండగా ఒకరి కోసం గోవాలో గాలిస్తున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి పేర్కొన్నారు.
ఆ ముగ్గురే చేశారా..!
స్టంట్స్ చేయడంలో అనుభవమున్న అభిజిత్ ఆ రోజు కారు నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. నంబర్ ప్లేట్ లేని కారు అయినప్పటికీ వారు వెళ్లిన దారిలో సీసీ ఫుటేజ్ ఆధారంగా అభిజిత్‌ను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆ రోజు కారులో వినయ్, మణిదీప్ ఉన్నారని చెప్పడంతో వారిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అడ్వకేట్ హత్య కేసులో కాంగ్రెస్ నేతను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఆ కాంగ్రెస్ నేతను పోలీసులు మొయిజుద్దీన్‌తో ఉన్న విభేదాలు, హత్య తదితర అంశాలపై ప్రశ్నించారు. మొదట తనకు ఏం తెలియదని, తనను పట్టుకొచ్చి అడగడమేంటంటూ అతను రివర్స్ కావడంతో పోలీసులు తమ దగ్గర ఉన్న ఆధారాలు చూపించి అతడి పాత్రను వివరించినట్లు తెలిసింది.