Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ): నదులు, వాగుల పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతూ ఉంటే పోలీసులు మాత్రం హైదరాబాద్ నగరంలో చిరువ్యాపారులపై విరుచుకుపడుతున్నరు. గాయం ఒకచోటైతే మందు మరొక చోట పెట్టినట్టు ఇసుక రీచ్‌లు, నదీ పరివాహక ప్రాంతాలు లేని హైదరాబాద్‌లో అక్రమ ఇసుక దందా నడుస్తూ ఉందంటూ వ్యాపారులను వేధిస్తున్నారు. కాగా ఇసుక నిల్వ చేసుకోవడం తప్ప తాం ఏం నేరం చేశామో అర్థం కావడం లేదని వ్యాపారులు విస్మయానికి గురవుతున్నారు.
నిర్మాణాలపై ప్రభావం..!
యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందాపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే కృష్ణా నది, గోదావరి నది పరీవాహక ప్రాంతాలపై దృష్టి పెట్టాల్సిన అధికారులు ఇసుకు నిల్వ చేసుకున్న చిరు వ్యాపారులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ముఖ్యంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో వ్యాపారులకు వేధింపులు అధికం అయ్యాయి. సాధారణంగా ఇసుక రీచ్‌లు ఉన్న తుపాకులగూడెం, భద్రాచలం, కరీంనగర్, పెద్దపల్లి తదితర ప్రాంతాలలో ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం ఇసుక ధర చెల్లించి లారీలలో హైదరాబాద్‌కు ఇసుకను రవాణా చేస్తుంటారు. కొందరు లారీల యజమానులు నేరుగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు సరఫరా చేస్తుండగా ఇంకా కొందరు అడ్డాలపై తెచ్చి పెడుతుంటారు.
ఈ అడ్డాల వద్ద నుంచి చిన్న చిన్న నిర్మాణాలకు తక్కువ మొత్తంలో ఇసుక కావాల్సిన వాళ్లు కొనుగోలు చేస్తుంటారు. దీంతో పాటు లారీలు ఎక్కువ సేపు ఇసుకతో ఉండలేవు, దీంతో కొందరు ఆ ఇసుకను కొనుగోలు చేసి ఖాళీ ప్రదేశాలను కిరాయికి తీసుకొని, లీజ్‌లకు తీసుకొని దానిని ఇసుక డంప్(డంగల్)గా వాడుకుంటారు. ఇక్కడి నుంచి రెండు మూడు టన్నులు అవసరాలను బట్టి చిన్న చిన్న వాహనాలలో కొనుగోలు చేసుకుంటూ కావాల్సిన వాళ్లు తీసికెళ్తుంటారు. అయితే లారీలో తెచ్చిన ఇసుకను కొని, దానిని ఈ చిరువ్యాపారులు రీసేల్ చేస్తుండడంతో కొద్ది మేర ధరను పెంచుకుంటారు.
నిబంధనల ప్రకారం ఇసుక రీచ్‌ల నుంచి తెచ్చిన ఇసుకనే ఇక్కడ కొని దానిని విక్రయిస్తున్నారు. ఇలా నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలలో ప్రధాన రోడ్లకు సమీపంలో ఇసుక డంప్‌లు ఏర్పాటు చేస్తూ వేలాది మంది ఈ వ్యాపారంపై ఆధారపడి నడుచుకుంటున్నారు. అవసరమైన వారికి ఇసుకను అందించడంలో ఇలాంటి డంప్‌లు పట్టణ ప్రాంత వాసులకు ఉపయోగపడుతున్నాయి. నిర్మాణాలకు కావాల్సిన ఇసుక ఇక్కడి నుంచి ఎక్కువగా సరఫరా అవుతుంది. అలాకాకుండా నేరుగా ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను కొనాలంటే తక్కువ మొతాదులో కావాల్సిన వారికి దొరకడం కష్టంగా మారుతుంది. ఇది నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి.
కావాలంటే నిల్వకు లైసెన్సులు తీసుకుంటాం
శివారులలో ఇసుకను కొని నిల్వచేసి విక్రయించే వ్యాపారం గత 30 ఏండ్లుగా సాగుతున్నది. అలాంటిది ఇప్పుడు ఈ వ్యాపారాన్ని నిలిపివేయాలని, ఇది అక్రమ ఇసుక దందాకు కారణమవుతుందంటూ దీనిపై ఆధారపడి ఉన్న వ్యవస్థను మొత్తం ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదంటూ పలువురు వ్యాపారులు వాపోతున్నారు. కావాలంటే లైసెన్స్‌లు పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తే తాము అందుకు సిద్ధమని వ్యాపారులు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఇలాంటి సమస్య పరిష్కారానికి అబ్దుల్లాపూర్‌మెంట్ ప్రాంతంలో ఇసుక డంప్ చేసుకునే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారని వ్యాపారులు పేర్కొంటున్నారు. అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలను ఆయా ప్రాంతాలలోని చెక్‌పోస్టుల వద్దే నిలువరించే అవకాశాలున్నా ప్రభుత్వ యంత్రాంగం అక్కడ ఏమీ చేయలేక తమలాంటి చిరు వ్యాపారులపై విరుచుకుపడితే తామేం చేయగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక డంపులపై పోలీసుల దాడులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఇసుకను నిల్వ చేసిన వ్యాపారులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం సౌత్‌వెస్ట్ జోన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా నాంపల్లి మండల రెవెన్యూ అధికారులతో కలిసి ఇసుక డంపులపై దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో పురానాపూల్‌లోని జుమ్మెరాత్ బజార్లో ఉన్న సందీప్ వేబ్రిడ్జ్, సందీప్ కన్‌స్టక్ష్రన్ అండ్ మెటీరియల్ గోడౌన్‌పై దాడులు చేసి 1.20లక్షల విలువ చేసే 60 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.