సిటీబ్యూరో, ఆగస్ట్ 30 (నమస్తే తెలంగాణ): గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలని, మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్‌జోన్, నార్త్‌జోన్‌లో ఉన్న పలు వినాయక మండపాలను శనివారం సీవీ.ఆనంద్ సందర్శించారు. నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీవీ.ఆనంద్ మాట్లాడుతూ విగ్రహాల దొంగతనం వంటి నేరాలను నివారించడానికి స్థానిక పోలీసులు, వాలంటీర్లు నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు.
సమస్యలు సృష్టించే వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి వచ్చే విగ్రహాల వాహనాలకు సరైన పోలీసు ఎస్కార్ట్ ఉండేలా చూడాలని తెలిపారు. రాత్రిపూట విగ్రహాల వద్ద వాలంటీర్లు, నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. గతంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా జరిగిన లోటుపాట్లపై చర్చించి, శాంతిభద్రతలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. గణేశ్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.
ఆ తర్వాత గణేశ్ మండపాల వాలంటీర్లు, నిర్వాహకులతో సీవీ.ఆనంద్ ప్రత్యేకంగా మాట్లాడారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, వర్షాలు పడుతున్నందున ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. మండపాల వద్ద భద్రతపై ఆయన ఆరా తీశారు. నిమజ్జనానికి సంబంధించి కూడా కమిషనర్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో సీపీ వెంట సౌత్‌జోన్ డీసీపీ స్నేహామెహ్రా, నార్త్‌జోన్ డీసీపీ రశ్మిపెరుమాల్, ఎస్బీ డీసీపీ అపూర్వరావు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌హెగ్డే, టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, పలువురు పోలీసు అదికారులు ఉన్నారు.