సిటీబ్యూరో, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో శోభయాత్ర సందర్భంగా జరిగిన సంఘటనలు, బందోబస్తు ఏర్పాట్ల విషయమై చర్చించి వారికి తగిన సూచనలు చేశారు.
చిన్న ఊరేగింపులు అనుసంధానమయ్యే కూడలి వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, మతపరమైన ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని నిరంతరం నిఘా కొనసాగించాలని సీపీ సూచించారు. ముందస్తు చర్యగా అధికారులు, సిబ్బంది, సిటీలోని అన్ని జోనల్ కంట్రోల్ రూమ్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ చైతన్యకుమార్, ఐటీ సెల్ డీసీపీ పుష్ప పాల్గొనగా వర్చువల్ జోనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.