Etala Rajendar | మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. ఉపేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌తో పాటు 30 మంది దాడి చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదైంది. అయితే, పోచారం మున్సిపల్ పరిధిలోని ఏకశిలానగర్‌లో ప్లాట్లను కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ బాధితులు ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. ఈ మేరకు ఈటల బీజేపీ కార్యకర్తలతో కలిసి స్థలాలను పరిశీలించారు. అదే సమయంలో ఆక్రమణదారుడికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడే మద్యం సేవిస్తూ కనిపించారు. ఇందులో ఒకరిపై ఈటల చేయి చేసుకున్నారు. మిగతా వారందరినీ బీజేపీ కార్యకర్తలు చితకబాదారు. నలుగురు అక్కడినుంచి పరారయ్యారు. ఉపేందర్, రఫీక్ అనే వ్యక్తులను కార్యకర్తలు దొరకబుచ్చుకొని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.