మన్సురాబాద్, జూలై 2: సీసీటీవీ నిఘా లేని గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో పంచలోహం, అల్యూమినియం, సిల్వర్ విగ్రహాలను చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు వారికి సహకరించిన మరొకరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఓ పాత నేరస్తుడు ఉన్నాడు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ పరిధి సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. కర్నూల్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండే కరచ శివానంద (52) ప్రస్తుతం వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీలో ఉంటున్నాడు.
శివానంద పాత నేరస్తుడు. కాజీపేట, మీర్‌పేట, నాగోల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఐదు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా శివానందలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలం, వల్లపల్లికి చెందిన ఎస్.కె.హమ్ షరీఫ్(38) ప్రస్తుతం ఎల్బీనగర్ లేబర్ అడ్డాల్లో నివసిస్తూ కూలీ పనిచేస్తున్నాడు. శివానందతో షరీఫ్‌కు పరిచయం ఏర్పడింది. మద్యానికి బానిసలుగా మారిన ఇద్దరికీ డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలు చేసేందుకు పథకం వేసుకున్నారు. శివారు ప్రాంతాల్లో సీసీటీవీ లేని ఆలయాల్లో చోరీలకు పాల్పడాలని శివానంద పథకం వేశాడు. ఇద్దరు కలిసి ఆటోను కిరాయికి తీసుకుని ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల పరిధిలో నాలుగు ఆలయాల్లో చోరీలు చేశారు.
గత నెల 24న ఉప్పల్ మెట్రో వద్ద బైకును అపహరించారు. అదే బైకుపై తిరుగుతూ ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లోని దండు మైలారం, పోల్కంపల్లిలో రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. పలు పంచలోహ విగ్రహాలతో పాటు వస్తువులను దొంగలించారు. విషయంపై ఇబ్రహీంపట్నం, యాచారం పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసు కట్టి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం మంగళ్‌పల్లి క్రాస్‌రోడ్ వద్ద ఇబ్రహీంపట్నం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అటువైపుగా బైక్‌పై వచ్చిన శివానంద, షరీఫ్ అనుమానాస్పదంగా కనిపించారు.
అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా చోరీ విషయం బయటపడింది. పంచలోహ, అల్యూమినియం, సిల్వర్ విగ్రహాలను శివానంద, షరీఫ్ నుంచి కొనుగోలు చేసిన ఉప్పల్, భరత్‌నగర్‌కాలనీలో నివాసముంటు శివకుమార్ ఎంటర్పైజ్రెస్ పేరుతో షాప్ నడుపుతున్న అక్కపల్లి క్రాంతికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశా రు. నిందితుల నుంచి రూ. 5 లక్షల 36వేల 300 విలువైన విగ్రహాలతో పాటు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరు దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు.