హైదరాబాద్ : సామాజిక రిజర్వేషన్లపై పార్లమెంట్ సమావేశాల్లో నే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) డిమాండ్ చేశారు. ఇటీవల పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీలో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్లో మాజీ ప్రధాని వీపీ సింగ్ (VP Singh) జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ 10 ఏండ్ల బీజేపీ(BJP) పాలన దేశంలో బీసీ(BCs) లకు చీకటి పాలనేనని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరూ ప్రధాన మంత్రి అయినా బీసీలకు ఒరిగిందేమి లేదని ఆరోపించారు.
ఓబీసీల సంక్షేమం కోసం మండల్ కమిషన్ను తీసుకొచ్చిన అప్పటి ప్రధాని వీపీ సింగ్కు ఉద్యోగ రంగంలో ఓబీసీలకు మొదటి సారిగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దక్కిందని అన్నారు. ఓబీసీ అని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి బీసీల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లను కల్పించకపోతే దేశ వ్యాప్తంగా మరో మహా మండల్ ఉద్యమాన్ని పెద్దఎత్తున చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ భాస్కర్, బీసీ నేతలు బూడిద మల్లికార్జున్ యాదవ్, పానుగంటి విజయ్, మాదేశి రాజేందర్, వీరమల్ల కార్తిక్, ప్రవీణ్ యాదవ్, జాజుల భాస్కర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.