సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): మార్కెట్ మెరుగుపడలేదు. పరిస్థితిలో మార్పు రాలేదు. కానీ భూములు అమ్మి ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒక ప్లాట్, రెండు ప్లాట్లు కాదు ఏకంగా హెచ్ఎండీఏ డెవలప్ చేసిన రెండు భారీ వెంచర్లలోని 1400 ప్లాట్లను మార్కెట్లోకి తీసుకురావాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు హెచ్ఎండీఏ అంచనాలను తలకిందులు చేస్తాయేమోననే ఆందోళన ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో నెలకొని ఉంది.
అన్ని మౌలిక వసతులతో సిద్ధంగా ఉన్నప్పటికీ… ఇప్పటికే అనేక వెంచర్లు మూలుగుతున్నాయి. ఒకసారి వేలం వేస్తే మార్కెట్‌ను అంచనా వేసే అవకాశం ఉన్నా… పరిస్థితులు అందుకు భిన్నం ఉండటంతో బేరానికి పెట్టేదేలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హెచ్ఎండీఏ డెవలప్ చేసిన వెంచర్లకు విశేషమైన ఆదరణ ఉంది.
అన్ని అనుమతులతోపాటు, నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దే ఈ ప్లాట్లకు సాధారణ జనాలు కూడా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మార్కెట్‌తో పోల్చితే తక్కువ ధర ఉండటంతో బడా కంపెనీలు కూడా బిడ్డింగ్‌లో పోటీ పడతాయి. ఈ క్రమంలోనే గతంలోనే నిర్వహించిన వేలంతో రికార్డు స్థాయి ధరలు పలికి, ఊహించని రీతిలో డిమాండ్ వచ్చింది. ఇక ఎకరం రూ.వంద కోట్లకు చేరడంతో… జాతీయ స్థాయిలో హైదరాబాద్ రియాలిటీకి గుర్తింపు వచ్చింది.
ఏడాదిన్నర కాలంగా కళతప్పిన ప్లాట్లు..
బీఆర్ఎస్ హయాంలో మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ రంగం.. తదనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరడం.. హైడ్రా ఏర్పాటుతో రాష్ట్రంలో రియల్ రంగం పూర్తిగా కుదేలైందని విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా మార్కెట్ తలకిందులు కావడంతో ఇప్పటికే డెవలప్ చేసిన వెంచర్లలోని ప్లాట్లతోపాటు, మిగిలిపోయిన వెంచర్ల ప్లాట్లన్నీ కళ తప్పాయి. ముఖ్యంగా తొర్రూర్‌లోని 117 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన వెంచర్లో 985 ప్లాట్లను ఇప్పటికే విక్రయించగా, మరో 490 ప్లాట్లు అదేవిధంగా ప్రతాప సింగారంలోనూ 165 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన లే అవుట్లో 790 ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.
వీటితోపాటు మేడిపల్లి, బుద్వేల్, షాద్‌నగర్‌తోపాటు కోకాపేట్ వంటి లేఅవుట్లలో ప్లాట్లు మిగిలి ఉన్నాయి. మొత్తంగా 1400పైగా ఉన్న ఓపెన్ ప్లాట్లను బహిరంగ మార్కెట్లో పెడితే.. ఆదాయం సమకూరడంతోపాటు, మార్కెట్‌కు ఊరట లభిస్తుందని సర్కార్ ఆశ పడుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో ప్లాట్లకు కళ లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ రెండు వెంచర్లలో మిగిలిన 1400 ప్లాట్లతోనే మార్కెట్ అసలు రూపం తెలిసిపోతుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మరికొన్నిరోజుల్లో వీటికి తెరపడనుంది.