సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): నిత్యం లక్షలాది వాహనాలు.. 30 లక్షల జనాభా… కోర్ సిటీకి వచ్చే వారి సంఖ్య 5-7 లక్షలు.. అయినా అరకొర రవాణా, రోడ్డు సేవలు.. ఏండ్లు గడుస్తున్నా మెరుగైన రవాణా సేవలు లేక, కేవలం వ్యక్తిగత, ఆర్టీసీ బస్సులే దిక్కుగా మారాయి. నార్త్ సిటీ వాసులకు మెట్రో అనేది తీరని కల. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్‌తో చిగురించిన ఆశలకు కేంద్రం మోకాలడ్డు పెడుతూనే ఉంది. బీఆర్ఎస్ సర్కార్ 2018లోనే డబుల్ డెక్కర్ ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. కానీ భూసేకరణ కొర్రీలతో వేధింపులతో ఎట్టకేలకు కేంద్రం 2023లో భూములు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సేకరించిన రక్షణ శాఖ భూములతోపాటు, నోటిఫై చేసిన ప్రైవేటు ఆస్తులను సేకరించాల్సింది పోయి వివాదాలకు తావించి శంకుస్థాపనతోనే రెండేళ్లు పూర్తి చేసింది. దీనికి కాంగ్రెస్ సర్కార్ రూపొందించిన ప్రతిపాదనల్లోని లోపాలు కూడా కారణం కావడం కూడా నార్త్ సిటీ వాసులకు ఇబ్బందిగా మారింది. హైదరాబాద్ మెట్రో సంస్థ ఫేజ్-2లో భాగంగా చేపట్టాల్సిన ప్రాజెక్టు కోసం రెండేళ్లుగా పోరాడుతున్న నార్త్ సిటీ మెట్రో సాధన సమితి…వినూత్న రీతిలో కార్యక్రమాలు, అవగాహన, ప్రాజెక్టు అవశ్యకత, పార్టీల సహకారం కోరుతూనే ఉంది. కానీ దేవుడు కరుణించినా.. పూజారి సహకరించడం లేదన్నట్లు మెట్రో పరిస్థితి మారింది. తాజాగా మరోసారి కేంద్ర మం త్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు నార్త్ సిటీ వాసులు కోరుతున్నా రు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రులైన కిషన్‌రెడ్డిని కలిసి తమ ఆవేదనను పంచుకునేందుకు సమయం కోరుతున్నారు.
నేతల చుట్టూ ప్రదక్షిణలు
గడిచిన రెండున్నరేళ్లలో నార్త్ సిటీ మెట్రో సాధన సమితి సభ్యులు కనిపించిన ప్రతి ఒక్క నేత ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తమ ప్రాంతానికి కలిగే నష్టాన్ని వివరించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమయం ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర సర్కార్ కూడా జాప్యానికి గల కారణాలను అన్వేషించాల్సింది పోయింది, కేంద్రంపై నెపాన్ని నెడుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో తమ ప్రాంతానికి మెట్రో ఆవశ్యకతను వివరిస్తూ నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. దీంతోనే కేంద్ర మంత్రిని మరోసారి కలిసేందుకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు.