సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ భూ బాధితులను అధికారులు వెంటాడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, భూముల పరిహారం తేల్చేంతవరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు చెబుతున్నా… అధికారులు మాత్రం వదల బొమ్మాళీ అంటూ వేధిస్తూనే ఉన్నారు. ప్రాజెక్టుకు భూములు ఇవ్వలేమని ఇప్పటివరకు చేపట్టిన అభిప్రాయ సేకరణతోపాటు, గ్రామ సభల్లో కూడా వ్యతిరేకించిన వందలాది భూ బాధితులకు అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు.
అయినా బాధితుల నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా ఫోన్‌కాల్స్ ద్వారా బాధితులను కార్యాలయానికి రప్పించే పనిలో పడ్డారు అధికారులు. ఈ క్రమంలో బాధితులకు వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్న యంత్రాంగం భూ సేకరణ జరిగేంత వరకు నోటీసులు జారీ చేస్తూనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో అధికారుల చర్యలకు బాధితులు కూడా దీటుగా బదులిస్తున్నారు.ఈ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ, ప్రాజెక్టు వెడల్పు కారణంగా తమ జీవనాధారమే కోల్పోతున్నామని.. ఎట్టిపరిస్థితుల్లో పరిహారంపై ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతనే కార్యాలయాలకు వస్తామని తేల్చిచెబుతున్నారు.
వందలాది మంది భూ యజమానులపై కాంగ్రెస్ సర్కార్ పెట్టిన ఎలివేటెడ్ కుంపటి ఆందోళనకరంగా మారుతోంది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం మార్గంలో భూ సేకరణకు గడిచిన ఏడాది కాలంగా అధికారులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొత్తం 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,500 ఆస్తులు నేలమట్టం అవుతుండగా… ప్రాజెక్టు వెడల్పును 200 అడుగుల నుంచి 100 ఫీట్లకు తగ్గించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం కూడా పరిహారంపై స్పష్టతనివ్వకుండా దోబూచులాడుతోంది. దీంతోనే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా రాజీవ్ రహదారి భూబాధితుల జేఎసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం బాధితుల వాదన పట్టించుకోకుండా, అధికారిక వేధింపులకు పాల్పడుతుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
భూముల సేకరణ కోసం రెండు జిల్లాల రెవెన్యూ యంత్రాంగం పదుల సంఖ్యలో నోటీసులు, గ్రామసభలు, అభిప్రాయ సేకరణ వంటి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించారు. అయితే వీటిలో ఏ ఒక్క సమావేశానికి కూడా బాధితులు పూర్తిస్థాయిలో హాజరు కాలేదు. హాజరైనవారు సైతం.. ప్రాజెక్టు వెడల్పు, పరిహారం వంటి డిమాండ్లకు అంగీకరిస్తేనే.. భూ సేకరణ అంశంపై మాట్లాడుదామంటూ తేల్చిచెప్పారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఈ అంశాన్ని పట్టించుకోకుండా… నోటీసులు జారీచేస్తూనే ఉంది. దీంతోపాటు తాజాగా వ్యక్తిగత ఫోన్‌కాల్స్ ద్వారా మండల రెవెన్యూ కార్యాలయాలకు రావాలంటూ పిలుస్తున్నారు.
అయితే ఇప్పటికే ప్రభుత్వం భూసేకరణ అంశంలో వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా వందలాది మంది హైకోర్టును ఆశ్రయించి, స్టే ఆర్డర్లు తీసుకున్నారు. తమ డిమాండ్లను ఆమోదించేంత వరకు తమ ఆస్తులను కూల్చకుండా కోర్టుల ద్వారా రక్షణ పొందుతున్నా.. అధికారులు మాత్రం బాధితులను ఏదో ఒక రకంగా భయాందోళనకు గురిచేసే చర్యలు దిగుతూనే ఉన్నారు. తాజాగా ఫోన్ కాల్స్ విషయంలోనూ బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత సమాచారం లేకుండా, ప్రైవసీ సమావేశాలకు హాజరుకాలేమని అధికారులకు తేల్చి చెప్పాలని జేఎసీ సమావేశంలో తీర్మానించినట్లుగా తెలిసింది.