సిటీబ్యూరో, జనవరి 26(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో విస్తరణలో ఫేస్-2లో అత్యంత రద్దీ కలిగిన మార్గంగా నాగోల్- శంషాబాద్ లైన్ కానున్నది. నాగోల్ నుంచి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును అనుసంధానం చేసే ఈ మార్గం పొడువు మొత్తం 36.8 కిలోమీటర్లు కాగా.. దీని ద్వారా నిత్యం 3.70 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది. ఫేస్-2లో కారిడార్-4ను దాదాపు రూ. 11, 226 అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే నగరం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
శంషాబాద్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు మెరుగైన రవాణా కల్పనలో భాగంగా మెట్రో ప్రతిపాదించిన మార్గం భవిష్యత్‌లో అత్యంత రద్దీ కలిగిన మార్గం కానున్నది. తొలి దశ మెట్రో నిర్మాణంలో నాగోల్-రాయదుర్గం మార్గం అత్యధికంగా ప్రయాణికులు వినియోగిస్తున్నారు. ఇదే తరహాలో ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ బిజీగా మారనున్నది. దీనికి అదనంగా 20 కిలోమీటర్లు నార్త్ సిటీ అనుసంధానం జరిగితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
36.8 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో మొత్తం 23 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రతిపాదిత మెట్రో స్టేషన్ల నిర్మాణంపై కొన్ని మార్పులకు అవకాశం ఉందని తెలిసింది. ఇందులో నాగోల్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి, కామినేని హాస్పిటల్, ఎల్బీ నగర్, బైరామల్‌గూడ, మైత్రీనగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట, ఓవైసీ హాస్పిటల్, డీఆర్డీవో, బాలాపూర్ రోడ్డు, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, గగన్ పహాడ్, శాతంరాయి, సిద్ధాంతి, శంషాబాద్, ఎయిర్‌పోర్టు కార్గో, ఎయిర్‌పోర్టు ప్రాంగణం వరకు ఈ మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రాథమిక దశలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మిస్తుండగా, భవిష్యత్‌లో మెట్రో వేగం పెరిగే అవకాశం ఉందని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ మార్గానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం డీపీఆర్ పంపించిన విషయం తెలిసిందే.