ఖైరతాబాద్, అక్టోబర్ 1: ఒక మనిషి శాకాహారుడిగా మారితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడాదికి 200 జంతువులను బతికించినట్లవుతుందంటూ పేటా ఇండియా పిలుపునిచ్చింది. ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా మంగళవారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద పేటా ఇండియా ప్రతినిధులు రక్తం అద్దిన పెద్ద ట్రేలలో ప్యాకింగ్ చేసి ఉన్న మాంసం ముద్దలా వేషధారణతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. మానవులతో పాటు అన్ని జంతువులు రక్త మాంసాలతోనే తయారయ్యాయని, మనుషుల మాదిరిగానే జంతువులకు నొప్పి, బాధ ఉంటాయని పేటా ప్రతినిధులు పేర్కొన్నారు.
ఒక మనిషి కోడి, మేక, ఇతర జంతువుల మాంసాన్ని తింటే.. అది శవాన్ని తిన్నట్టే అవుతుందన్నారు. కబేళాల్లో జంతువులను అతి క్రూరంగా కోసి చంపుతారని, అది జీవ హింసే అవుతుందన్నారు. జంతువులను చంపడం వల్ల పర్యావరణ సమతుల్యత, జీవవైవిద్యం దెబ్బతింటుందని, ప్రపంచం శాకాహారం వైపు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసిందన్నారు.