దుండిగల్: సూరారం, విశ్వకర్మకాలనీలోని రోడ్డు పక్కన నిలిపిన ఓ ప్యాసింజర్ ఆటోలో ఓ వ్యక్తి ప్లాస్టిక్ బ్యాగును వదిలివెళ్లాడు. ఆటో యజమాని ప్లాస్టిక్ బ్యాగు ఉండటాన్ని గమనించి, అందులో ఏం ఉందో చూడకుండానే రోడ్డు పక్కన పడేశాడు. కాలనీవాసులు సదరు ప్లాస్టిక్ బ్యాగులో మగ శిశువు ఉన్నట్లు గుర్తించి, పోలీసులకు, స్థానిక అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులకు సమాచారం అందించారు.
అదే సమయంలో స్థానికంగా పిల్లలు లేని ఓ కుటుంబం శిశువును పెంచుకునేందుకు ముందుకువచ్చింది. ఈ క్రమంలో వైద్యపరీక్షల కోసం శిశువును స్థానికంగా ఉన్న వైద్యశాలకు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. నెలలు నిండకపోవడంతోనే శిశువు మృతిచెందినట్లు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.