బడంగ్‌పేట, ఆగస్టు 25: గుంతలమయంగా మారిన రోడ్డులో బైక్ స్కిడ్ అయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడకు చెందిన మీనని నర్సింగ్ రావు (40) అల్మాస్గూడ నుంచి శ్రీశ్రీహోమ్స్ దగ్గరకు వస్తున్న క్రమంలో రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.
గుంతలను పూడ్చివేయాలని స్థానికులు పలుమార్లు బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయిన అధికారులు పట్టించుకోక పోవడంతో గుంతలో పడి నర్సింగ్ రావు మృతి చెందినట్లు మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య నవనీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. రహదారులు గుంతలమయంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.