సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల నిర్వహణలో హైడ్రా అధికారుల పనితీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరపడం, పనుల్లో నిర్లక్ష్యం వహించిన నాలుగు ఎంఈటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకున్న హైడ్రా.. వారి స్థానం లో తిరిగి కొత్తవారికి అవకాశం కల్పించేందుకు ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. ఈ సమయంలో అందరూ కొత్త ఏజెన్సీలకు అవకాశం వస్తుందని భావించారు..కానీ తిరిగి న లుగురిలో మెహిదీపట్నం మినహా పాత ఏజెన్సీలకే తిరిగి పట్టం కట్టిన అధికారుల పనితీరు విమర్శలకు తావిస్తోంది.
ప్రధానంగా తార్నా క, మెట్టుగూడ, జల్పల్లి ప్రాం తాల పనులు పాత వారికే కట్టబెట్టడం వెనుక భారీ ఎత్తున చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలు శ్రీదేవి లునావత్, గుండ్ల శ్రీకాంత్, వెంగళ్రావుల టెండర్లపై పునఃపరిశీలించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. మాన్సూన్ పనుల్లో అరకొర సిబ్బందితోనే పనులు చేయించి, కాంట్రాక్టర్లు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ సోమవారం ‘ప్రజలకు మాన్సూన్.. కాంట్రాక్టర్లకు మనీసూన్’ శీర్షికన నమస్తే తెలంగాణ ప్రచురించిన ప్రత్యేక కథనం కాంట్రాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే టెండర్లు దక్కించుకున్న ప్రాంతాల్లో పనితీరు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలు సేకరించి.. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. క్యూర్ పరిధిలోని అన్ని సర్కిల్స్‌లో తనిఖీలు చేస్తే పెద్ద మొత్తంలో లోపాలు బయటపడతాయని, కాంట్రాక్టర్ల పనుల పారదర్శకత బహిర్గతమవుతుందని చెబుతున్నారు.
ఉప్పల్ జోన్ పరిధిలో ప్రతిరోజు.. ప్రతి డివిజన్లో మూడు షిప్టుల్లో 12 మంది పనిచేయాల్సి ఉండగా నలుగురితోనే పనులు చేయిస్తున్నారు. అవగాహనలోపంతో సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగడంతోపాటు, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జోన్ పరిధిలో మొత్తంగా 6 డివిజన్లకు 72 మంది పనిచేయాల్సి ఉండగా, మూడోవంతు మాత్రమే విధుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.