Double Bedroom Houses | సిటీ బ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన ఇండ్ల లిస్టులో తమ పేరు వచ్చినప్పటికీ ఇందిరమ్మ ఇంటి కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి తమను ఎంపిక చేసిందని ఆ ఇండ్లనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కిందనైనా తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్లనే ఇవ్వాలని కోరుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైన వారికి పట్టాలు పంపిణీ చేయాలని అంటున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలోని నలుమూలలా లక్ష డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించారు. దాదాపు 68 వేల మందికి పైగా పట్టాలు పంపణీ చేశారు. మిగిలిన 32 వేల ఇండ్లకు అర్హులను గుర్తించారు. వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు ధ్రవీకరణతో పాటు లబ్ధిదారుల జాబితాను విడుదల చేశారు. పట్టాలు పంపిణీ చేసే సమయానికి శాసన సభ ఎన్నికల కోడ్ రావడంతో ఆపేశారు. ఆ జాబితాలో పేరు వచ్చిన వారు తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ గెలిచి ఉంటే తమ ఇండ్లు తమకు వచ్చేవని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్జీలు తీసుకోవడమే తప్ప.. ఇండ్లిస్తామనే భరోసా మాత్రం ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నిర్మించి సిద్ధంగా ఉన్న ఇండ్లను అర్హులకు పంచకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావొస్తున్నా ఒక్క పథకంపైనా స్పష్టత లేకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఏడాది నుంచి దరఖాస్తుల పేరిట కాలయాపన చేస్తూ.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటిదాకా దరఖాస్తులు చేసుకోవడమే కానీ ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు, ఆధార్ కార్డుల జిరాక్స్లకే వందలాది రూపాయలు ఖర్చవుతోందని అంటున్నారు. దరఖాస్తుల పేరిట రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడమే కానీ.. ప్రభుత్వ పథకాలు అమలైన దాఖలాలు లేవని నిట్టూరుస్తున్నారు.
నేను 25 ఏండ్లుగా ఖాద్రీబాగ్లో ఉంటున్నా. కేసీఆర్ కట్టిచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైన లిస్టులో నాపేరుండె. కొంతమందిని బస్సుల్లో తీసుకెళ్లి ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు. నా పేరు మూడో లిస్టులో ఉంది. నన్ను కూడా బస్సులో తీసుకెళ్లి ఇల్లు ఇస్తమని చెప్పిండ్రు. ఇంత లోపే ఎన్నికల కోడ్ రావడంతో ఇండ్లిచ్చేది ఆపిండ్రు. కేసీఆర్ సార్ మల్ల సీఎం అయితే నాకు ఇల్లొచ్చేది. కాంగ్రెస్ గవర్నమెంట్ల ఇప్పటికి 3 సార్లు దరఖాస్తు చేసుకున్నా. కానీ ఇల్లిస్తమని గ్యారంటీగ చెబ్తలేరు. కేసీఆర్ పాలనలో అన్నీ సమయానికి వచ్చేవి. ఇప్పుడు ఏదీ సక్కగా ఇస్తలేరు. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతున్నం.
– ఆంగోత్ తులసి, ఖాద్రీబాగ్, అంబర్పేట.
నాకు ముగ్గురు పిల్లలు. బోరబండల బార్బర్గ చేస్తున్న. ఎర్రగడ్డల 30 ఏండ్ల నుంచి ఉంటున్న. వచ్చే జీతం ఇంటి కిరాయికే సరిపోతలేదు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అంటూ దరఖాస్తులు తీసుకుంటున్నరు కానీ ఎప్పుడిస్తరో చెబ్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ పథకంకూడా సరిగ్గా అమలు చేస్తలేదు. కాంగ్రెసొచ్చి 15 నెలలు అయితున్నది. దరఖాస్తుల పేరుతో రోజుల తరబడి తిప్పించుకుంటున్నరు కానీ పేదోళ్లకు చేసిందైతే ఏమీ లేదు.
– ఏముల రామకృష్ణ, ఎర్రగడ్డ.