Harish Rao | సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదని హరీశ్‌రావు అన్నారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనారిటీ విభాగం సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుసేన్, సలీం, బీఆర్ఎస్ మైనారిటీ నేత సొహయిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మరొక మంత్రి మహమూద్ అలీ.. కేసీఆర్ మైనారిటీలకు ఇచ్చిన గౌరవం అది అని అన్నారు. మైనార్టీలు మంత్రిగా ఉంటే మైనార్టీ పోర్ట్‌ఫోలియో ఏదో ఇచ్చి చేతులు దులుపుకుంటారు.. కానీ కేసీఆర్ మైనార్టీ మంత్రికి ప్రాధాన్యత ఉన్న శాఖలను ఇచ్చి గౌరవించుకున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. కానీ కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేసినందుకు బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేలా బుద్ధి చెప్పాలని కోరారు. హైడ్రా, మూసీ పేర్లతో ముస్లిం సోదరుల ఇళ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చిందని తెలిపారు. కూల్చిన ఇండ్లకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్లను ఇవ్వలేదు కానీ ఉన్న ఇళ్లను కూలగొట్టాడని విమర్శించారు.
నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నాను, కాంగ్రెస్‌లో ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ రెడ్డి స్వయంగా చెబుతాడని హరీశ్‌రావు గుర్తుచేశారు. పొద్దుతిరుగుడు పువ్వు లాగా రేవంత్ రెడ్డి బీజేపీ చుట్టూ తిరుగుతుంటాడని అన్నారు. బీజేపీలో చదువుకున్నానని స్వయంగా చెప్పే ముఖ్యమంత్రిని మైనార్టీలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అందరం కలిసి పనిచేసి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడానికి కృషి చేయాలని కోరారు.