అబిడ్స్, ఆగస్టు 31: ‘గోషామహల్ పోలీస్స్టేడియం ప్రాంతంలో ఉస్మానియా దవాఖాన నిర్మిస్తే.. స్థానికులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.. అంతేకాకుండా మార్చురీ ఏర్పాటు..వాహనాల రాకపోకలతో ఈ ప్రాంతంలో మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తుంది’. అంటూ.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు గోషామహల్ ప్రాంతంలో చేపట్టిన ఆందోళన శనివారం రెండో రోజుకు చేరుకున్నది.
మొదటి రోజు హజారి భవన్ వద్ద, రెండో ఆర్యసమాజ్ వద్ద దవాఖాన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. స్థానికులు సంతకాల సేకరణ చేపట్టారు. గోషామహల్ ప్రజా పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి.. ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆసుపత్రి ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునేంత వరకు ఆందోళన చేస్తామని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నిరసనలో వినోద్, శైలేశ్, హేమ, నేహాల్, కేదార్, పశుపతి, ప్రశాంత్ ముదిరాజ్, బలరాం తదితరులు పాల్గొన్నారు.