నగరానికి ఆక్సిజన్ అందించే కల్పతరువులాంటి కేబీఆర్ పార్కుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న విధ్వంసాన్ని సిటీ జనాలు తట్టుకోలేకపోతున్నారు. అభివృద్ధి పేరిట వందలాది వృక్షాలను నేలమట్టం చేస్తుంటూ భరించలేకపోతున్నారు. మదర్స్ డే సందర్భంగా తల్లిలాంటి ప్రకృతిని కాపాడుకునేందుకు వందలాది మంది నగరవాసులు పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులతో కలిసి కేబీఆర్ పార్కు విధ్వంసానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. పర్యావరణాన్ని నిర్వీర్యం చేసే హెచ్-సిటీ కంటే నీడనిచ్చే వృక్షాలే కావాలంటూ నినదించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ పౌరులు కదం తొక్కుతూ… కేబీఆర్ పార్కుతో ఉన్న అనుబంధాన్ని, సర్కారు చేస్తున్న విధ్వంసాన్ని చూసి ఆవేదన చెందారు.
– సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ)
కాంక్రీట్ జంగిల్ లక్ష్యంగా కేబీఆర్ పార్కు చుట్టూ జరుగుతున్న నిర్మాణ పనులపై ఓవైపు కోర్టు పరిధిలో విచారణ సాగుతున్నా… ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకడలతో అడ్డు వచ్చిన వందలాది మహా వృక్షాలను నేలమట్టం చేస్తోంది. ఏప్రిల్ 18 నుంచి అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్, ఒమెగా హాస్పిటల్ పరిసరాల్లో ఉన్న వందలాది చెట్లను నరికిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. కోర్టు స్టే ఏకో సెన్సిటివ్ జోన్ పరిధిలోని విధ్వంసం చేయడంపై నగరవాసులు మండిపడుతున్నారు. న్యాయమూర్తులు సెలవుల్లో ఉండటం, కోర్టులకు ఉన్న వేసవి సెలవులను ఆసరాగా చేసుకున్న సర్కార్, ఎవరూ అడ్డుకోలేరనట్లుగా ధీమాతో చెట్లను అడ్డగోలు నరికివేస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరకాలంటే నిర్ణీత అధికారి సంతకం, స్టాంపుతో కూడి ఫాం-14 అనుమతి అనివార్యం. కానీ జీహెచ్ఎంసీ మాత్రం ఉనికిలో లేని రహస్య కమిటీల పేరుతో మభ్యపెడుతున్నదని పర్యావరణ, సామాజికవేత్తలు విజయ్ ముల్లంగి, అడ్వకేట్ లుబ్నా సార్వత్ మండిపడ్డారు. కేబీఆర్ పార్కు చుట్టూ సర్కార్ చేస్తున్న విధ్వంసంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే… మరోవైపు ఫ్లైఓవర్లు, అండర్ పాసుల పేరుతో ఈ అటవీ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తోందనీ పబ్లిక్ పాలసీ నిపుణులు డా. దొంతి నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విస్తృతమైన వనసంపద, వన్యప్రాణులు, పర్యావరణంతో ఎంతో వైవిధ్యమైన కేబీఆర్ పార్కును కాపాడుకుంటేనే నగరవాసికి స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ప్రాణవాయువును అందించే కేబీఆర్ పార్కు చుట్టూ కాంగ్రెస్ సర్కార్ హెచ్ సిటీ పేరిట ఉరి బిగిస్తోంది. ఈ పార్కు పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హైదరాబాదీ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. నగరవాసులు మద్ధతు తెలిపి సర్కార్ చర్యలను నిలువరిస్తాం. సోషల్ మీడియా వేదికగాను ప్రభుత్వ చర్యలను అడ్డుకునేలా #SAVEKBRతో మద్దతు తెలిపాలంటూ పలువురు పర్యావరణవేత్తలు సూచించారు.
బంజారాహిల్స్, మే 10: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ మనుగడకే ప్రమాదం కలిగించేలా హెచ్ సిటీ పేరుతో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ ప్రేమికుల ఆందోళన తీవ్రతరమైంది. ఆదివారం సాయంత్రం వందలాదిమంది యువతీయువకులు, పర్యావరణ ప్రేమికులు, వివిద స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి జంక్షన్ వద్దకు చేరుకుని నల్ల టీషర్ట్స్‌తో మౌన ప్రదర్శన, మానవహారం కార్యక్రమాలను చేపట్టారు. కేబీఆర్ పార్కు చుట్టూ అండర్‌పాస్‌ల నిర్మాణం పేరుతో వందలాది చెట్లను నరికివేస్తున్నారని, దీనివల్ల హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న కేబీఆర్ పార్కు చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ మాయమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ భారీ యంత్రాలతో చెట్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబీఆర్ పార్కు చుట్టూ భూగర్భంలో కాంక్రీట్ గోడలు నిర్మిస్తే సుమారు 400ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కేబీఆర్ పార్కులోని చెరువుల్లోని భూగర్భ జలాలు నిలిచిపోయి వరదలు సంభవించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. సేవ్ కేబీఆర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ సుమారు మూడు గంటల పాటు వాక్ నిర్వహించడంతో పాటు అడ్డగోలుగా నరికివేసిన చెట్లకు సంఘీభావంగా క్యాండిల్స్ ప్రదర్శన నిర్వహించారు. కేబీఆర్ నేషనల్ పార్క్‌ను కాపాడేందుకు ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేశారు.
కాలుష్య కారకాల నుంచి రక్షణ కల్పించే ఈ కేబీఆర్ పార్క్ ఒక ఏకోలాజికల్ సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉంది. రెండోది ఈ పార్కు విషయంలో సర్కారు తీరు, ప్రణాళికాబద్ధంగా సాగుతున్న చర్యలన్నీ కూడా న్యాయపరంగా నిలువ లేవు. వీటిని తప్పించుకుని ప్రాజెక్టు చేపట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధి పేరిట సాగుతున్న ఈ విధ్వంసంపై ఇప్పటివరకు ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదనే విషయాన్ని సర్కార్ స్పష్టం చేయాలి.
– దినేశ్ చంద్ర, ఆర్టిస్ట్, హైదరాబాద్ నివాసి
సర్కార్ చెబుతున్నట్లుగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలో సర్కార్ వద్ద జవాబుదారీతనం లోపించింది. ప్రభుత్వ సంస్థలే పర్యావరణాన్ని కాలరాసేందుకు కుట్రలు చేస్తుంటే.. లోపించిన జవాబుదారీతనం కోసం ప్రజలు ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితులే వస్తాయి. కానీ సర్కార్ మాత్రం అడ్డగోలు పర్యావరణాన్ని నిర్వీర్యం చేస్తోంది. అది కూడా గుట్టు చప్పుడు కాకుండానే జరుపుతోంది.
– కాజల్ మహేశ్వరి, హైదరాబాద్ వాసీ
హెచ్సిటీ ప్రాజెక్టు పేరిట కేబీఆర్ పార్కు చుట్టూ కాంక్రీట్ నిర్మాణాలను కడుతామంటే ఎలా చూస్తు ఊరుకోవాలి.? ప్రాణవాయువును అందించే కేబీఆర్ పార్కు ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చి నగరవాసుల ప్రాణాలతో సర్కార్ చెలగాటమాడుతోంది. ప్రతి చెట్టు కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. సర్కార్ వెనక్కి తగ్గేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తాం.
– శ్రీహర్షిత, ప్రకృతి ప్రేమికురాలు
ప్రకృతిపై సర్కార్ చేస్తున్న వినాశన చర్యలను నిలువరిస్తాం. ఈ మదర్స్ డే సందర్భంగా తల్లిలాంటి ప్రకృతిని, భూమిని కాపాడుకోవడమే నా బిడ్డల కోసం చేయగలిగే అతిపెద్ద సాయం. హెచ్‌సీయూ తరహాలోనే ఇక్కడ కూడా అణచివేత ధోరణి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప.. ఈ విధ్వంసం ఆగదు. 400 ఎకరాల పచ్చని అడవినీ కాపాడుకోవడానికి పోరాటానికి నగరవాసులు సిద్ధం కావాలి.
– నటాషా రామరత్నం, పర్యావరణ ప్రేమికురాలు