నగర చెత్తను ఏండ్లుగా భరిస్తూ.. నరకం అనుభవిస్తున్న జవహర్‌నగర్ ప్రజలు.. చెత్తపై పోరుబాట పట్టారు. కాలుష్యం..ప్రాణాంతక వ్యాధులు..దుర్వాసనతో కంటి మీద కునుకు లేకుండా జీవనం సాగిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో చెత్తలోనే బతుకు వెల్లదీస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా..‘డంపింగ్’ నుంచి విముక్తి కలగడం లేదు. ఇంత కష్టాలు పడుతున్నా.. సర్కార్ మాత్రం మౌనం వహించడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. చెత్త డంపింగ్‌కు చెక్ పెట్టాలంటూ..నిరసన గళాన్ని వినిస్తున్నారు. అలుపెరుగని ఉద్యమాలు చేస్తున్నారు. వీరికి తోడుగా నిరాహార దీక్షలు, సభలు సమావేశాలు వంటివి నిర్వహిస్తూ.. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. చెత్త డంపింగ్ ఎత్తివేసేలా.. సర్కార్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. కోర్టులు, ఎన్జీటీలో కేసులు వేస్తూ.. యార్డు దమ్మాయిగూడ జేఏసీ పోరాటం చేస్తున్నది. చెత్త కష్టాలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది.
-సిటీబ్యూరో/ జవహర్‌నగర్, జూన్ 27 (నమస్తే తెలంగాణ)

సిటీ బ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతో పరిసర గ్రామాల ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజు పది వేల మెట్రిక్ టన్నుల కుంటే ఎక్కువ చెత్తను తీసుకొచ్చి పోగు చేస్తుండటంతో దుర్వాసన, కాలుష్యంతో అవస్థలు పడుతున్నారు. ఏండ్ల తరబడిగా చెత్త కంపుతో సహజీవనం చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఆ ప్రాంత ప్రజలకు చెత్త కంపు నుంచి విముక్తి కలిగించడం లేదు. దిక్కుతోచని స్థితిలో చెత్తలోనే ఏండ్ల తరబడిగా జీవితాలను వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలుస్తున్నాయి.
వారి సమస్యలను ప్రభుత్వాలు, కోర్టులు, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ హరిత ట్రిబ్యునల్, మానవహక్కుల కమిషన్ల దృష్టి తీసుకెళుతూ న్యాయం చేయాలని నిరంతర పోరాటాలు చేస్తున్నారు. చెత్త గుట్టల నుంచి వచ్చే దుర్వాసన, కాలుష్యం నుంచి జవహర్‌నగర్ పరిసరాల్లోని సుమారు పది గ్రామాలకు విముక్తి కలిగించాలని అలుపెరుగని ఉద్యమాలు చేస్తున్నారు. విభిన్న రూపాల్లో డంపింగ్ యార్డు నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, అధికారులు దిగిరావాలని నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఏండ్ల తరబడిగా చేస్తున్న పోరాటాలకు దన్నుగా నిలుస్తున్నారు. ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు, మానవహారాలు, సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో ప్రభుత్వం, అధికారులను నిత్యం నిలదీస్తున్నారు.

2004 నుంచే పోరాటాలు..
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల ప్రజల పక్షాన ప్రజా సంఘాలు దన్నుగా నిలుస్తున్నాయి. ఏండ్ల తరబడిగా నిరసనలు, ఆందోళనలతో అక్కడి ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాయి. తొలుత జవహర్‌నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుంచి మొదలైన ఉద్యమాలు జీహెచ్ఎంసీలో కలిసి.. జీహెచ్ఎంసీ నుంచి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిసే దాకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి దశలో అన్ని ప్రజా సంఘాలు ఈ ప్రాంతంలో చెత్తను వేయొద్దని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2004 నుంచే డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటైంది. ఈ పోరుబాటలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు అలుపెరగని పోరాటాలు చేస్తూ రాంకీ యాజమాన్యాన్ని నిరసిస్తూ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు.
అప్పట్లో గబ్బీలాల్పేటలో విష జ్వరంతో చిన్నారి మృతి చెందడంతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. డంపింగ్ యార్డు ప్రభావంతో చుట్టుపక్కల ఏడు చెరువులు పూర్తిగా కలుషితమై ఏటా టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడుతుండటంతో జాలరులు కలెక్టర్, మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపడుతున్నారు. ఏండ్ల తరబడిగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల సమక్షంలో నిరాహార దీక్షలు చేస్తుస్తున్నారు. రాంకీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పాదయాత్రలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు.ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. రచ్చబండలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నారు. పలువురు చెత్త గుట్టల్లో గల్లంతై నేటికీ ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర మనోవేదన పడుతున్నారు.
జేఏసీలు ఏర్పాటు చేసి ..
చెత్తతో సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్న డంపింగ్ యార్డుకు అతి సమీపంగా ఉన్న జవహర్‌నగర్, దమ్మాయిగూడ గ్రామాల్లో డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట సమితి పేరిట ఐక్య జేఏసీ ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలు జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల పడుతున్న ఇబ్బందులను అధికారులకు వివరిస్తున్నారు. చెత్త నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలని రాంకీ యజమానులకు నిరంతరం విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలు, కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలకు నిత్యం తిరుగుతూ అధికారులకు తమ బాధలను చెప్పుకొంటున్నారు. దాదాపుగా 20 ఏండ్ల నుంచి సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పలువురు పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఉద్యమాలను కొనసాగిస్తున్నారు.