మండుతున్న ఎండల వేళ.. నగరవాసులు చుక్క నీటి కోసం చుక్కలు చూస్తున్నారు.. నల్లా ఎప్పుడొస్తుందా.. అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఒక్కో చోట.. ఒక్కో తాగునీటి వ్యథ.. అంతులేని కథలా మారింది. కొన్ని ప్రాంతాల్లో లోప్రెషర్ వేధిస్తుంటే.. మరికొన్ని చోట్ల తక్కువగా సరఫరా అవుతున్నది. ఇక ఉచిత ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. వచ్చిన అరకొర ట్యాంకర్లూ.. ఒకటీ అర డ్రమ్ములను నింపేసి వెళ్తుండటంతో ఆ ఒక్క డ్రమ్ము నీటితో ఇంటిల్లిపాది సరిపోక.. దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. సమస్య తెలిపేందుకు జలమండలి కార్యాలయాలకు పరుగులు తీస్తున్నా..రోడ్డెక్కి. .క‘న్నీటి’ కష్టాలను ఏకరువు పెడుతున్నా.. ఫలితం లేకుండాపోతున్నది. ఒకవైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు తాగునీటి సమస్యల నడుమ నగర ప్రజలు నలిగిపోతున్నారు. ఎక్కడ చూసినా.. ప్రైవేట్ ట్యాంకర్లే దర్శనమిస్తున్నాయి. అవి కూడా ధరలు ఆకాశాన్నంటుతుండటంతో నిరుపేదలు ‘కొనలేక’ నీరు లేక..దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నారు. వీటికితోడు కలుషిత నీరు భయపెడుతుంటే.. పైపులైన్ల లీకేజీలు వెక్కిరిస్తున్నాయి. తరచూ అంతరాయలు ఠారెత్తిస్తున్నాయి..వెరసి.. నగరవాసులకు మండు వేసవిలో గొంతెండి..తల్లడిల్లిపోతున్నారు. కాంగ్రెస్ పాలనలో నీటి కష్టాలు షరామాములే..అన్న నానుడిని నిజం చేస్తూ..సాగుతున్న ప్రజా పాలనలో జనం నీటి గోడును వినే వారే కరువయ్యారు.

సిటీ బ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): నగరంలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. నల్లా నీళ్లు ఎప్పుడొస్తాయోనని కండ్లు కాయలు కాస్తున్నాయి. ఎక్కడ చూసినా తాగునీటి సమస్య వేధిస్తుంది. ఓ వైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు తాగునీటి సమస్యతో ప్రజలు నలిగిపోతున్నారు. ఎక్కడ చూసినా ప్రైవేట్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. ధరలు ఆకాశాన్నంటడంతో నిరుపేదలు గోసపడుతున్నారు. లోప్రెషర్, సరఫరాకు అంతరాయం కలగడం, రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా అవుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. అర్ధగంట సమయం కంటే తక్కువగా నీళ్లు వస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. ట్యాంకర్లు ఒకటి అర డ్రమ్ములను నింపేసి వెళ్తున్నాయని.. ఉచిత ట్యాంకర్లను కమర్షియల్‌గా విక్రయించుకుంటూ ప్రజల గొంతులను ఎండబెడుతున్నారని వాపోతున్నారు. రెండు మూడు రోజులుగా నీళ్లు రాకపోవడంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు.

Drinking Water
ప్రేమ్‌నగర్‌లో ఏడాదంతా నీటి ఎద్దడి
కొండాపూర్: ప్రేమ్‌నగర్‌లో ఎండాకాలం, వర్షాకాలం అనే తేడాలు లేకుండా ఏడాదంతా నీటి సమస్యలు వేధిస్తునే ఉన్నాయి. కలుషిత నీళ్లు, లోప్రెషర్, సరఫరా ఆగిపోవడం, మ్యాన్‌హోళ్లు పొంగిపోవడం వంటి ఇబ్బందులు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. ఎండాకాలం వచ్చిందటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. నీటి సమస్యపై కాలనీ వాసులు జలమండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో అధిక సంఖ్యలో చిన్నా, చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్లే ఉండడం, కేవలం 15 నిమిషాల పాటు లో ప్రెసర్తో కుళాయి నీళ్లు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికొకసారి పైపులైన్ మరమ్మతులు, వాల్వ్‌ల మరమ్మతులంటూ నీటి సరఫరాను నిలిపివేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని నీటి కష్టాలను తీర్చాలంటూ కోరుతున్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటి కొనుగోలు..
అమీన్పూర్/జిన్నారం : అమీన్పూర్ పరిధిలోని కిష్టారెడ్డిపేట, దాయర, సుల్తాన్పూర్ గ్రామాల్లో రెండు, మూడు రోజుల కోసారి నీటి సరఫరా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమీన్పూర్ పరిధిలోని భరత్‌నగర్, ఎస్ఎస్ హోమ్స్, దర్బార్ హోమ్స్ కాలనీల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. దీంతో పాటు అన్ని కాలనీల్లోని అపార్టు మెంట్లలో రెండు రోజులకో సారి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ పరిధుల్లోని జిన్నారం, గడ్డపోతారం, ఖాజీపల్లి తదితర గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. నీటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మూడు నెలలుగా మురుగు నీరే దిక్కు
రామంతాపూర్, మే 4: రామంతాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీరామ కాలనీ, స్ట్రీట్ నంబర్ -16 ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. ఇకడి ప్రజలకు సరఫరా అవుతున్న నీరు పూర్తిగా కలుషితమై వస్తోంది. తాగునీటిలో డ్రైనేజీ వాటర్ కలవడంతో దుర్గంధంతో పాటు నీరు మొత్తం బురదగా రావడం, నురుగు రూపంలో వస్తుండటంతో ప్రజలు వాటిని తాగలేక పోతున్నారు. గత్యంతరం లేక కొంత మంది తాగుతూ అస్వస్థతకు గురవుతున్నారు. ఈ సమస్య మూడు నెలల నుంచి ఉందని, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిషరించాలని కొన్ని రోజులుగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆర్వో ప్లాంట్లకు బారులు
ఖైరతాబాద్, మే 4 : ఎండాకాలంలో జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తాగునీటి గోస తప్పడం లేదు. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో నీటి కోసం వాటర్ ప్లాంట్ల వద్దకు బారులు తీరుతున్నారు. జలమండలి వాటర్ ట్యాంక్ క్లీనింగ్ పేరుతో ఖైరతాబాద్‌లో నీటి సరఫరా బంద్ చేసింది.
బండ్లగూడలో అరగంటే..
బండ్లగూడ: రాజేంద్రనగర్ జలమండలి జోన్ వ్యాప్తంగా తాగునీటి కష్టాలతో ప్రజలు అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో జలమండలి నీటిపైనే ఆధారపడుతున్నారు. కానీ అధికారులు మాత్రం అర్ధగంటకు మించి సరఫరా చేయకపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన అరగంట కూడా లోప్రెషర్‌తో రావడంతో నీళ్లు సరిపోవడం లేదని జనాలు ఆరోపిస్తున్నారు. అటు జలమండలి నీళ్లు రాకపోవడం.. ఇటు ఇండ్లలోని బోర్లు ఎండిపోవడంతో అవస్థలు పడుతున్నారు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న ప్రాంతాలకు సరిపడా సరఫరా చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలుండే కాలనీలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే రెండు మూడు రోజులు సక్రమంగా సరఫరా చేసి తర్వాత పాత పాటే పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తమ గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు.
లోప్రెషర్ ముప్పు.. ట్యాంకర్లే దిక్కు
హయత్‌నగర్: హయత్‌నగర్, లెక్చరర్స్ కాలనీ డివిజన్లలోని పలు కాలనీల్లో లోప్రెషర్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని జలమండలి అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. హయత్‌నగర్ డివిజన్లోని అన్మగల్ హయత్‌నగర్, పోచమ్మ బస్తీ, సత్యానగర్, లెక్చరర్స్ కాలనీ డివిజన్లోని శివగంగా కాలనీ, ఆర్టీసీ సూపర్ వైజర్స్ కాలనీల్లో అసంపూర్తిగా ఉన్న వాటర్ వర్క్స్ నిర్మాణ పనులు, భూగర్భ డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటి ఇబ్బందుల వల్ల ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
బస్తీలకు ఐదురోజులకోసారి..
బంజారాహిల్స్: బంజారాహిల్స్, తట్టిఖానా జలమండలి సెక్షన్ల పరిధిలోని పలు బస్తీల్లో తాగునీటి సమస్యలు వేధిస్తుంది. నందినగర్, వెంకటేశ్వరనగర్, వడ్డెర బస్తీ, లంబాడా బస్తీ, కేఎల్ టవర్స్ తదితర ప్రాంతాల్లో రెండునెలలుగా సరఫరా సరిగ్గా జరగకపోవడంతో స్థానికులు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ఉన్నతాధికారులు స్పందించి తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించినప్పటికీ సమస్య మాత్రం పూర్తిస్థాయిలో తీరలేదని ఆరోపిస్తున్నారు. ఇందిరానగర్‌లోని పలు వీధుల్లో లోప్రెషర్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులకోసారి తాగునీరు వస్తోందంటూ ఇటీవల ఎమ్మెల్యేను సైతం అడ్డుకున్నారు. సమస్య పరిష్కరిస్తామని జలమండలి అధికారులు హామీ ఇచ్చినా పరిస్థితిలో మాత్రం మార్పులేదు.
10 నిమిషాలే..నీటి సరఫరా
చర్లపల్లి: చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో పది నిమిషాలకు మించి తాగునీరు సరఫరా కావడం లేదని కాలనీల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వచ్చిన పది నిమిషాలు కూడా లో ప్రెషర్ ఉండటంతో తాగునీరు ఎటూ సరిపోవడం లేదని వాపోతున్నారు. డివిజన్ పరిధిలోని సోనియాగాంధీ నగర్, రెడ్డి కాలనీ, మారుతి కాలనీ, భగవాన్ కాలనీ, సాయినగర్, కృష్ణారెడ్డినగర్, శివసాయి నగర్, బీఎన్‌రెడ్డి కాలనీల్లో సరఫరా హెచ్చుతగ్గులు, లోప్రెషర్‌తో కేవలం పదినిమిషాల పాటే వస్తున్నదని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.
పసుపుపచ్చగా తాగునీరు
ఖైరతాబాద్, మే 4 : ప్రజా పా లన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీటి సరఫరాలోవిఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్‌లో మళ్లీ కలుషిత నీరు సరఫరా కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందిరానగర్‌లోని డబుల్ బెడ్రూం గృహ సముదాయంలో తాగునీరు పచ్చగా రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ఇదే సమస్య పుననావృతమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలికి పలుమార్లు ఫిర్యాదులు చేసి, కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు మాత్రమే మామూలు నీరు వచ్చిందని, సోమవారం నుంచి మళ్లీ అదే పచ్చని నీరు రావడం మొదలైందని తెలిపారు. బస్తీల్లో కలుషిత నీరు తాగి పలువురు దవాఖానల పాలైన ఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కుటుంబానికి ఒక్క డ్రమ్ము నీళ్లే..
సైదాబాద్: ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణికాలనీ, ఖాజాబాగ్ బస్తీల్లోకి తాగునీటి ట్యాంకర్లు రాకుంటే దాహార్తితో అల్లాడాల్సిందే. 20 ఏండ్లుగా నల్లా కనెక్షన్లు లేక పోవటంతో జలమండలి వైశాలి నగర్ రిజర్వాయర్ నుంచి ఉచిత ట్యాంకర్లు అందిస్తున్నారు. అరకొరగా రావడంతో ట్యాంకర్ వచ్చిందంటే నీటి కోసం మహిళలు యుద్ధం చేయాల్సివస్తోంది. ఒక కుటుంబానికి ఒకే డ్రమ్ము నీరు మాత్రమే ఇస్తున్నారు. ఒకే డ్రమ్ము నీటితో కుటుంబమంతా ఎలా బతకాలో తెలియక సర్దుబాటు చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. రిజర్వాయర్‌లో స్టోరేజ్ తక్కువ ఉన్నా ఆన్లైన్ బుకింగ్, కమర్షియల్ ట్యాంకర్లకు ప్రాధాన్యత ఇచ్చి, ఫ్రీ ట్యాంకర్లను తగ్గిస్తున్నారు. పేదలకు నీళ్లను సరఫరా చేయకుండా కమర్షియల్‌గా విక్రయించడమేంటని బస్తీ ప్రజలు నిలదీస్తున్నారు.