సిటీ బ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) ; జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌పై సకల వర్గాల ప్రజలు తమ నిరసనలతో దండయాత్ర చేస్తున్నారు. రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు చేసిన మోసాలపై విభిన్న రూపాల్లో తెలియజేస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ బాధితులే కనిపిస్తున్నారు. ఎన్నికల ముందు తమకిచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నదో తెలియజేసేలా ప్లకార్డులతో ర్యాలీలు తీస్తున్నారు.
ఓటర్లను కలుస్తూ తమకు జరిగిన అన్యాయాలను వివరిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే జరిగే మోసాన్ని తెలియజేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అందజేస్తామంటే ఓట్లేసి గెలిపిస్తే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని నిరుద్యోగులు విరుచుకుపడుతున్నారు. పింఛన్ల పెంపు, ఉద్యోగాల్లో ప్రత్యేక వాటా పేరిట తమకు అన్యాయం చేసిందని దివ్యాంగులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమయంలో అరచేతిలో స్వర్గం చూపించి దగా చేశారని అక్కడి ప్రజలు జూబ్లీహిల్స్‌లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇలా అన్ని వర్గాల వారు కాంగ్రెస్‌ను ఓడించాలంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

కదం తొక్కుతున్న దివ్యాంగులు, కుల సంఘాలు
రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రజలు తమ వ్యతిరేకతను జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఓటర్ల ముందు ఉంచుతున్నారు. దివ్యాంగులు కాంగ్రెస్ తమకు చేసిన అన్యాయానికి నిరసనగా కృష్ణకాంత్ పార్క్ నుంచి వెంగళరావు నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దివ్యాంగుల పింఛన్లు రూ.6వేలకు పెంచుతామని మాట తప్పారు. ఉద్యోగాల్లో 4 శాతం వాటా ఇస్తామని దగా చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమస్యలన్నీ తీరుస్తామని మోసం చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఓడిస్తేనే సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి వస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ తమకిచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని వివిధ కులాల ప్రతినిధులు జూబ్లీహిల్స్ ప్రజలకు వివరిస్తున్నారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ శాస్త్రీయంగా చేయకుండా రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందని మాల సంఘాల జేఏసీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. తమకు జరిగిన అన్యాయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు మాల సామాజిక వర్గ ప్రజలకు వివరిస్తున్నది. వీరితో పాటు వివిధ వర్గాల ప్రజలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ను ఓడించాలని అభ్యర్థిస్తున్నారు.
రాజకీయ నేతలతో సమానంగా ప్రచారం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలతో సమానంగా నిరుద్యోగులు ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ తరఫున బ్యాచ్‌లుగా విడిపోయి విభిన్న రీతుల్లో కాంగ్రెస్ చేసిన మోసాలను ఓటర్లకు వివరిస్తున్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే మమ్మల్ని నడిరోడ్డు మీద నిలబెట్టారని చూపుతూ అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి నిండా ముంచారని, కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు పెట్టిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి వారి ఖాతాలో వేసుకుంటున్నారని వివరిస్తున్నారు.
గంగెద్దును జూబ్లీహిల్స్‌లో తిప్పుతూ గంగెద్దుకైనా ఓటేస్తే పుణ్యం వస్తుంది కానీ.. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసం, దగా, నమ్మకద్రోహం మిగులుతుందని వాపోతున్నారు. కండ్లకు గంతలు కట్టుకుని, కాంగ్రెస్ మోసాలను ఇక చూడలేమంటూ, నోటికి గుడ్డ కట్టుకుని కాంగ్రెస్ అబద్ధాలను తెలిపేలా వినూత్న విధాలుగా ఎండగడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గెలవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడుతారని.. ఎట్టిపరిస్థితిలో ఆయనను నమ్మొద్దని సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలుగుతుందని, ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్‌కు ఓటేయొద్దని కోరుతున్నారు.
తమలా మోసపోవద్దంటూ..
దివంగత ఎమ్మెల్యే లాస్య నదింత అకాల మరణంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్, కాంగ్రెస్ నాయకులు కంటోన్మెంట్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. 6 వేల ఇందిరమ్మ ఇండ్లు, రూ.23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్, కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చి కంటోన్మెంట్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని హామీలిచ్చారు. ఉప ఎన్నిక జరిగి ఏడాదిన్నర పూర్తయినా ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీంతో ఆగ్రహించిన కంటోన్మెంట్ ప్రజలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను నమ్మొద్దని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కోడిని చూపిస్తూ ‘ఆహ నా పెళ్లంట’లో కోట శ్రీనివాసరావు పరిస్థితి మాకు వచ్చిందని ఇంటింటికీ తిరుగుతూ చెబుతున్నారు. కంటోన్మెంట్ ప్రజల్లా జూబ్లీహిల్స్ ఓటర్లు మోసపోవద్దని, కాంగ్రెస్‌ను నమ్మి ఓటేయొద్దని సూచిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓడిస్తేనే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలకు బుద్ధి వస్తుందని వివరిస్తున్నారు.