హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రమంత్రికి రాసిన లేఖ కలకలం రేపుతున్నది. టోల్ మినహాయించాలని, అందునా ఒక మార్గంలోని ప్రయాణికుల విషయంలో మాత్రమే పరిశీలించండని చేసిన విన్నపం విమర్శలకు తావిస్తున్నది. పక్క రాష్ట్రంలోని పెద్ద పండుగపై ఉన్న మ క్కువ, మన రాష్ట్రంలో కీలక ఫెస్టివల్స్‌పై ఎందుకు లేదని పలువురు ప్రశ్నిస్తుండగా, ఆ ఒక్క దారిపైనే ఎందుకంత ప్రేమని మరికొందరు నిలదీస్తున్నారు. ‘పండుగ ఎవరికైనా పండుగే., ఉత్సవం ఏదైనా ఉ త్సాహమే.
సకుటుంబంగా సొంత ఊరెళ్లి నాలుగు దినాలు గడిపే మధురానుభూతికి ప్రాంత, స్థాయీభేదాలు ఉండవు. ఆం ధ్రా జనాలకైనా, తెలంగాణావాసులకైనా ఎవరి సంప్రదాయాలు వారివి., ఎవరి పండుగల ప్రత్యేకతలు వారికే. తెలుగు రాష్ర్టాల ఆచార వ్యవహారాలన్నింటినీ ఒకే లా ట్రీట్ చేయాల్సిన సర్కార్ పెద్దల కొన్ని ‘తోల్’మందం చర్యలతోనే తలనొప్పులు, విపరీతమైన చిక్కులు. సొంతింటిపై సో యి లేదు గానీ, పరాయి వారిపై ప్రేమేం టో’ అని జనాగ్రహం పెల్లుబికుతున్నది. మంత్రి కోమటిరెడ్డి కేంద్రమంత్రి గడ్కరీకి రాసిన లేఖపై ఇటు రాష్ట్ర ప్రజలు, అటు ఇతర మార్గాల్లో ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులూ తీవ్రంగా మండిపడుతున్నారు.
జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్ – విజయవాడ మార్గంలో టోల్ ట్యాక్స్ మినహాయింపు కోరుతూ మంత్రి కోమటిరెడ్డి లేఖ వివాదాస్పమవుతున్నది. తెలంగాణ పండుగలకు ఏనాడూ మంత్రి టోల్‌ట్యాక్స్ మినహాయింపు కోరింది లేదుగానీ, ఒక్క సంక్రాంతికే కోరడం, అందునా ఈ ఒక్క మార్గంలోనే అభ్యర్థించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు కేవలం రాష్ట్రం నుంచే కాదు, దేశవ్యాప్తంగా పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. తెలంగాణ ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ, బోనాల సందర్భంగా కూడా నగరం నుంచి సొంతూళ్లకు భారీగా వెళ్తుంటారు, దసరా, ఉగాది, దీపావళి వంటి పర్వదినాల్లో కూడా జనం ఊర్లబాటపడుతారు.., ఇవేవీ మంత్రి కోమటిరెడ్డికి కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ పండుగలకు హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలతో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ రహదారులు కిక్కిరిసిపోతాయి. మంత్రి కోమటిరెడ్డి ఆయా పండుగలకు టోల్‌ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని ఎందుకు కోరలేదని, కేవలం సంక్రాంతికి అందునా ఆంధ్రా ప్రాంతానికి రాకపోకలు సాగించేవారి సౌకర్యార్థం మినహాయింపు ఇవ్వాలని లేఖ రాయడం ఏంటని జనం ఆగ్రహిస్తున్నారు.