Madhura Nagar Police Station | వెంగళరావునగర్, మే 24 : మధురానగర్ పోలీస్ స్టేషన్ అనగానే మధురానగర్ ప్రాంతంలో వెతుకుతున్నారా? మీరు ఎంత వెతికినా అది కనిపించదు. ఎందుకంటే అది పక్కనున్న రహమత్ నగర్ డివిజన్లో ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు ఫిర్యాదుదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఠాణా జాడను గుర్తించేందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. మధురానగర్ పోలీసు స్టేషన్ కోసం మధురానగర్‌కు వెళ్తే.. ఇక్కడ లేదది.. రహ్మత్ నగర్ లో ఉందని చెబుతుండటంతో బాధితులు ఇటూ అటూ తిరిగలేక సతమతమవుతున్నారు.
రహ్మత్‌నగర్‌లోని ఓ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నిమ్స్‌మే గతంలో పోలీసు శాఖకు అప్పగించింది. ఇక్కడ అప్పట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అనుసంధానంగా రహ్మత్‌నగర్ పోలీస్ ఔట్‌పోస్టు ఉండేది. రెండేళ్ల క్రితం ఈ ఔట్‌పోస్టును మధురానగర్ పోలీస్ స్టేషన్‌గా మార్చారు. ఎస్ఆర్ నగర్‌లోని కొన్ని ప్రాంతాలు, జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలను ఈ ఠాణా పరిధిలోకి తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ స్టేషన్ చిరునామా తెలియని జనాలు మధురానగర్‌కు వెళ్తే.. పోలీస్ స్టేషన్ ఉన్నది ఇక్కడ కాదు.. రహ్మత్‌నగర్‌లో అని చెప్పడంతో అటూఇటూ తిరగలేక సతమతమవుతున్నారు. హైదరాబాద్ నగరంలోని చాలా స్టేషన్ల విషయంలో ఇదే పరిస్థితి ఉండేది.
ఆ కన్ఫ్యూజన్ను పోగొట్టేందుకు ఇటీవల జరిగిన నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏ ప్రాంతాల్లో ఉండే పోలీస్ స్టేషన్‌కు అక్కడి పేరే ఉండాలనే ఉద్దేశంతో ఠాణా పేర్లను మార్చారు. సెక్రటేరియట్ పోలీసుస్టేషన్‌ను లేక్ పోలీసుస్టేషన్‌గా పేరు మార్చారు. హుమాయన్ నగర్ పోలీసు స్టేషన్‌ను మెహిదీపట్నం పోలీసు స్టేషన్‌గా మార్చారు. షాహినాయత్ గంజ్ పోలీసు స్టేషన్ ను గోషామహాల్ పోలీసుస్టేషన్ గా మార్చేశారు. కానీ మధురానగర్ పీఎస్ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో మధురానగర్ స్టేషన్ కూడా రహ్మత్ నగర్ పోలీసు స్టేషన్‌గా మార్చితే ప్రజలకు సులువుగా అడ్రస్ తెలిసేదని స్థానికులు అంటున్నారు. మరి పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.