మల్కాజిగిరి/నేరేడ్మెట్, డిసెంబర్ 28: ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడ్డారు. గురువారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలోని మల్కాజిగిరి, నేరేడ్మెట్, వినాయక్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, గౌతంనగర్, మౌలాలి, అల్వాల్, వెంకటాపురం, మచ్చ బొల్లారం డివిజన్లలో ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఉదయమే ప్రజలు సెంటర్లకు చేరుకోగా కొందరికి దరఖాస్తు ఫారాలు అందజేశారు. దరఖాస్తు ఫారాలు లేకపోవ డంతో మరికొందరు జిరాక్స్ సెంటర్లకు పరుగులు తీశారు. ఫారాలు లేకపోవడంతో ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అంతేకాకుండా దరఖాస్తుదారుల సందేహాలకు అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు 5 గంటల వరకే తీసుకుని ఆ తర్వాత కేంద్రాలు మూసి వేయడంతో ప్రజలు ఊసురుమంటూ వెనుదిరిగారు. మల్కాజిగిరి చౌరస్తాలోని ఇందిరా భవన్లో ఐదు గంటలకే అధికారి కేంద్రాన్ని మూసివేస్తున్నమని చెప్పడంతో దరఖాస్తు దారులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ వాగ్వాదానికి దిగారు. నేరేడ్మెట్లోని అంబేద్కర్ భవన్ సెంటర్‌న ఐదు గంటలకు మూసి వేశారు. దాంతో ప్రజలు ఊసురుమంటూ వెనుదిరిగారు.
గౌతంనగర్ డివిజన్ మధుసూదన్‌నగర్ కమ్యునిటీహాల్, నేరేడ్మెట్ డివిజన్ జెజెనగర్ కమ్యునిటీ హాల్, యాప్రాల్ మల్లన్న టెంపుల్, అంతయ్యకాలనీ, యాప్రాల్ జేజెనగర్, మధుసూదన్‌నగర్, ఏకలవ్వనగర్, గోపాల్‌నగర్, జ్యోతినగర్ కమ్యునిటీహాల్‌లో గురువారం ఆరు గ్యారెంటీ పథకాల స్వీకరణ దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జనవరి 6వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని, ఆందోళన చెందవద్దని సూచించారు. అయితే చాలాచోట్ల సరైన ఏర్పాట్లు చేయలేదు. దరఖాస్తు ఫారాలు లేకపోవడంతో దళారులు ఒక్కో ఫారాన్ని 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. కార్యక్రమంలో వెంకటేశ్ యాదవ్, బికే. శ్రీనివాస్. జీఎన్వీ సతీష్‌కుమార్, రామ్‌చందర్, కన్నెమల్ల నాగరాజు, సుమలత, ప్రవీణ్, సంతోష్ రాందాస్, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్జోన్ బృందం, డిసెంబర్ 28 : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా జనసందోహం తక్కువగా కనిపించింది. కేంద్రాల వద్ద దరఖాస్తు ఫారాల కొరత నెలకొన్నది. జీరాక్స్ సెంటర్లలో అధిక ధరలకు దరఖాస్తు ఫారాలు విక్రయించారు. కేంద్రాల్లో మంచినీటి సౌకర్యం లేదు. దరఖాస్తులు నింపడానికి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దాంతో దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. కొన్ని కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు దరఖాస్తు ఫారాలను అందజేశారు.
చిలుకానగర్ మహిళాభవన్ కేంద్రంలోని ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రాంతంలో ఒకే కేంద్రం ఉండటం, పేద, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువగా రద్దీ కనిపించింది. అయితే ఈ కేంద్రంలోనే ప్రభుత్వ పాఠశాల నడుస్తుంది. విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా ఉండటంతోపలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 8 రోజుల పాటు ఈ కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ ఉండటంతో పాఠశాల నిర్వాహణ, విద్యార్థుల చదువులపై ప్రభావం చూపనుంది.
ఉప్పల్ సర్కిల్ పరిధిలో ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియను గురువారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. పలు డివిజన్లలో కార్పొరేటర్లు, అధికారులు పరిశీలించారు. చిలుకానగర్‌లోని వార్డు కార్యాలయ ప్రాంతంలో ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియను ఎల్బీనగర్జోన్ స్పెషల్ ఆఫీసర్ జ్యోతిబుద్ధాప్రకాశ్, జోనల్ కమిషనర్ పంకజ, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ పరిశీంచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రామంతాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభయ హస్తం ఆరు గ్యారెంటీలను ప్రజలంతా వినియోగించుకోవాలని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్, రామంతాపూర్ డివిజన్ నాయకులు బండారు వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం నెహ్రూనగర్, స్నేహానగర్ తదితరులు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తు సెంటర్లను వారు పరిశీలించి మట్లాడారు. కార్యక్రమంలో కుమారస్వామి, నారాయణదాసు,దయానంద్‌రెడ్డి,నగేశ్,శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
చర్లపల్లి : డివిజన్ పరిధిలోని చర్లపల్లి ఈసీనగర్ కమ్యూనిటీ హాల్, సీనియర్ సిటిజన్ భవనం, వీఎన్‌రెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్, కుషాయిగూడ వార్డు కార్యాలయంలలో ఏర్పాటు చేసిన అభయ హస్తం కేంద్రాల్లో గురువారం ప్రజలు దరఖాస్తులను అందజేశారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్కిల్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్ పరిధిలో వల్వర్నగర్ బస్తీ దవాఖానా, గాంధీనగర్, వంపుగూడ, సాయిరాంనగర్ కమ్యూనిటీ హాళ్లలో ఏర్పాటు చేసిన అభయ హస్తం దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణి ప్రారంభించారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలో ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి ప్రారంభించారు.