Hyderabad | అమీర్పేట, మార్చి 22: జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం రోడ్లపై వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. నిత్యం వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతుండే మార్గాల్లో జరుగుతున్న ర్యాంప్ నిర్మాణాలు కొత్తగా తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
ముఖ్యంగా సనత్ నగర్ ఎస్ఆర్టీ క్వార్టర్లలోని నెంబర్ 803 లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ర్యాంప్ నిర్మాణాలపై స్థానికుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ భవన యజమానులు నిర్మాణాలను చకచకా చేపడుతున్నారు. అసలే నామమాత్రపు వెడల్పుతో ఇరుకుగా మారిన ఈ రోడ్డును సగం వరకు ఆక్రమిస్తూ జరుగుతున్న ఈ ర్యాంప్ నిర్మాణాలు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. సనత్ నగర్ కూరగాయల మార్కెట్ తో పాటు పలు రకాల షాపింగ్ సెంటర్ కు దారి తీసే మార్గాల్లో ఇది ముఖ్యమైన మార్గం కావడంతో వాహనదారులతో పాటు పాదచారులు ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ మార్గంలో ర్యాంప్ పేరుతో జరుగుతున్న రోడ్డు ఆక్రమాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.