మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 15: తాగునీటి సరఫరాలో అంతరాయం, లోప్రెజర్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అప్పారెడ్డి ముఖేశ్ అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఆయన మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభంలోనే అరకొర నీటి సరఫరా చేస్తుండడంతో రానున్న రోజుల్లో ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా మారనుందో అర్థం అవుతుందన్నారు. ఈ విషయాన్ని లైన్మెన్లను ప్రశ్నిస్తే తాము చేసేది ఏమి లేదని అంతా పైఅధికారుల సూచనలను పాటిస్తున్నామని చెబుతున్నారన్నారు. అత్తాపూర్ వాసులతో కలిసి జలమండలి జీఎం సాయిలక్ష్మి, డీజీఎం జోహర్అలీలను కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. అధికారులు బుధవారం ఉదయం అత్తాపూర్లో పర్యటించనున్నట్లు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ నాయకులు పుప్పాల లక్ష్మణ్, మల్లేశ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.